ఛత్తీస్​గఢ్​లో మావోయిస్టుల బంద్ ​హింసాత్మకం

ఛత్తీస్​గఢ్​లో మావోయిస్టుల బంద్ ​హింసాత్మకం
  • ఛత్తీస్​గఢ్​లో సెల్​ఫోన్​ టవర్లకు నిప్పు  
  • మందుపాతరలు పేలి ఇద్దరు మహిళలకు గాయాలు
  • రోడ్డుకు అడ్డంగా కందకాలు, చెట్ల నరికివేత

భద్రాద్రికొత్తగూడెం/భద్రాచలం, వెలుగు : ఎన్​కౌంటర్లను నిరసిస్తూ మావోయిస్టులు ఆదివారం బంద్​కు పిలుపునివ్వగా హింసాత్మకంగా మారింది. ఛత్తీస్​గఢ్​ రాష్ట్రం బీజాపూర్​ జిల్లా మోదక్​పాల్​ పోలీస్​ స్టేషన్​పరిధిలోని కందుల్​నార్ ​ప్రాంతంలో రెండు సెల్​ఫోన్​ టవర్లను తగలబెట్టారు. సుకుమా జిల్లా జేగురుగొండ పోలీస్​స్టేషన్​ పరిధిలోని భీమాపురంలోని ఓ ఇంటిలో పోలీసుల కోసం పెట్టిన మందుపాతర పేలి ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఛత్తీస్​గఢ్​‌‌‌‌–తెలంగాణ సరిహద్దు రోడ్లపై పలు చోట్ల కందకాలు తవ్వారు. 

పూసుగుప్ప, ఉంజుపల్లి ప్రాంతాల్లో రోడ్లకు అడ్డంగా చెట్లను నరికి పడేశారు. భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ బి. రోహిత్​ రాజు మాట్లాడుతూ మావోయిస్టులు అమరుస్తున్న బూబీ ట్రాప్స్​, ఐఈడీ బాంబ్స్​ వల్ల గిరిజనులు భయపడుతూ బతుకుతున్నారని, వారికి ఇబ్బందులు కలుగజేసే విధానాలను వీడాలన్నారు. ఆపరేషన్​చేయూత ప్రోగ్రామ్​కు ఆకర్షితులైన ఇప్పటి వరకు 15 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. లొంగిపోయిన వారిలో ఇద్దరు డిప్యూటీ కమాండర్లు, ముగ్గురు ఏరియా కమిటీ మెంబర్లు, ఐదుగురు దళ సభ్యులు, ఐదుగురు మిలీషియా సభ్యులు ఉన్నారని చెప్పారు.