- కేయూ డిగ్రీ పరీక్షల్లో ఇష్టారాజ్యం
- పాస్ పర్సంటేజ్ కోసం కుమ్మక్కైన ప్రైవేట్ కాలేజీలు
- ఒకరికొకరు సహకరించుకుంటూ చూచిరాతలు
- ఇప్పటివరకు 127 మందికి పైగా డిబార్
- అక్రమాలకు పాల్పడుతున్న కాలేజీలపై చర్యలు శూన్యం
హనుమకొండ, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ దందా జోరుగా నడుస్తోంది. పాస్ గ్యారంటీ అని చెప్పుకుంటున్న కొన్ని ప్రైవేటు కాలేజీలు విద్యార్థుల నుంచి వసూళ్లకు పాల్పడి మాస్ కాపీయింగ్ చేయిస్తున్నాయి. ఒక కాలేజీతో మరో కాలేజీ కుమ్మక్కై చూచిరాతలను ప్రోత్సహిస్తున్నాయి. దీంతో కేయూ పరిధిలోని ప్రైవేటు కాలేజీ తీరుపై గతం నుంచే ఫిర్యాదులు ఉండగా, తాజాగా ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతూ పెద్ద సంఖ్యలో స్టూడెంట్స్ పట్టుబడుతున్నారు. దీంతో స్టూడెంట్లను డిబార్ చేస్తున్న అధికారులు.. అక్రమాలకు పాల్పడుతున్న కాలేజీలపై మాత్రం యాక్షన్తీసుకోవడం లేదు.
ఆదిలాబాద్‌లో చూచిరాతల పర్వమే..
కేయూ పరిధిలో డిగ్రీ ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ సెమిస్టర్ఎగ్జామ్స్ నవంబర్ 28 నుంచి ప్రారంభమయ్యాయి. వర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలు ఉండగా.. ఈ పరీక్షల కోసం మొత్తంగా 121 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇందులో ఆదిలాబాద్‌లో 46, ఖమ్మం 29, వరంగల్‌లో 46 సెంటర్లు ఉండగా.. అంతా కలిపి 1,77,274 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. తమ తమ కాలేజీల పాస్ పర్సంటేజీ పెంచుకోవడం కోసం కొన్ని ప్రైవేటు కాలేజీలు అడ్డదారులు తొక్కుతున్నాయి. విద్యార్థుల నుంచి వసూళ్లకు పాల్పడి మాస్ కాపీయింగ్ చేయిస్తున్నాయి. ముఖ్యంగా ఈ దందా ఉమ్మడి ఆదిలాబాద్జిల్లాలో పెద్ద ఎత్తున కనిపిస్తోంది. అక్కడ చాలా ప్రైవేటు కాలేజీలు ఒకదానితో ఒకటి కుమ్మక్కైనట్లు తెలుస్తోంది.
కాలేజీల పరస్పర ఒప్పందం తరువాత స్టూడెంట్లకు స్లిప్పులు ఇచ్చి మరీ మాస్ కాపీయింగ్‌కు అలవాటు చేస్తున్నాయి. ఫ్లయింగ్ స్క్వాడ్ జరుపుతున్న తనిఖీల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పట్టుబడుతుండటమే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. ప్రతిసారి ఇదే తంతు జరుగుతుండగా.. గతేడాది చూచిరాతల సమాచారం అందుకుని ఇచ్చోడ మండలానికి వెళ్లిన కేయూ ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బందిపై అక్కడున్న కొంతమంది స్టూడెంట్స్ దాడులకు పాల్పడే దాకా వచ్చిందంటే అక్కడ పరిస్థితి ఎలా తయారైందో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటికే 127 మంది డిబార్
నవంబర్28 నుంచి పరీక్షలు ప్రారంభం కాగా.. చాలాచోట్లా కాలేజీలు, ఇన్విజిలేటర్లు అంతా ఒక్కటై చూచిరాతల పర్వం కొనసాగిస్తున్నారు. దీంతో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ సడెన్ విజిట్లు చేస్తుండటంతో కేయూ పరిధిలోని జిల్లాల్లో శుక్రవారం వరకు 127 మంది విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతూ అధికారులకు చిక్కారు. ఇందులో అత్యధికంగా 102 మంది విద్యార్థులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పట్టుబడినవారే కావడం గమనార్హం. వారితో పాటు ఖమ్మం జిల్లాలో 17 మంది, వరంగల్ జిల్లాలో 8 మంది స్టూడెంట్స్ మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతుండగా.. అధికారులు పట్టుకుని డిబార్ చేశారు.
కాలేజీలపై నో యాక్షన్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు చాలాచోట్లా ప్రైవేటు కాలేజీలు కుమ్మక్కై మాస్ కాపీయింగ్ దందా సాగిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. విద్యార్థుల నుంచి వసూళ్లకు పాల్పడడంతో పాటు పరస్పర ఒప్పందంతో చూచిరాతలు నిర్వహిస్తున్నాయి. కాగా తనిఖీల్లో భాగంగా చూచిరాతలకు పాల్పడుతున్న విద్యార్థులను డిబార్ చేస్తున్న కేయూ అధికారులు.. మాస్ కాపీయింగ్‌కు ప్రోత్సహిస్తున్న కాలేజీలపై మాత్రం ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే కాకతీయ యూనివర్సిటీ పేరున దాదాపు 250 మందికి ఫేక్సర్టిఫికెట్లు ఇష్యూ అయిన వ్యవహారం అప్పట్లో కలకలం రేపగా.. పరీక్షల ప్రతిసారీ చూచిరాతల పర్వంతో వర్సిటీ మరింత అపవాదు మూటగట్టుకోవాల్సి వస్తోంది. ఇకనైనా కేయూ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్న ప్రైవేటు కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
సీరియస్ యాక్షన్ తీసుకుంటం
పరీక్షల్లో మాస్‌కాపీయింగ్‌కు పాల్పడకుండా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ తో తనిఖీలు నిర్వహిస్తున్నాం. మాస్ కాపీయింగ్ కు పాల్పడుతున్న విద్యార్థులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం. కాలేజీలు కుమ్మక్కై మాస్ కాపీయింగ్ ను ప్రోత్సహిస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటాం.- ప్రొఫెసర్ కట్ల రాజేందర్, కేయూ ఎగ్జామినేషన్స్ కంట్రోలర్