
సిద్దిపేట, వెలుగు : బీఆర్ఎస్ ఎల్కతుర్తి సభ నేపథ్యంలో ఆదివారం సిద్దిపేటలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల నుంచి సిద్దిపేట మీదుగా ఎల్కతుర్తి సభకు భారీగా వాహనాలు రావడంతో సిద్దిపేట పట్టణ శివార్లలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా రంగధాంపల్లి అమరవీరుల స్తూపం వద్ద కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మధ్యాహ్నం 2 నుంచి సాయత్రం 4 గంటల వరకు అమరవీరుల స్తూపం వద్ద వాహనాలు నిలిచిపోవడంతో ఆమార్గంలో ప్రయణించే సామాన్యులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఒకవైపు మండే ఎండ మరోవైపు ముందుకు సాగని వాహనాలతో రోడ్డు పక్కన చెట్ల కింద ప్రయాణికులు కూర్చోవడం కనిపించింది.
పోలీసులు రంగధాంపల్లి చౌరస్తా వద్ద వాహనాల రాకపోకలను క్రమబద్దీకరించే ప్రయత్నం చేసినా సాధ్యపడకపోవడంతో రాజీవ్ రహదారి నలువైపులా భారీగా వాహనాలను నిలిచిపోయాయి. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రంగథాంపల్లి చౌరస్తా వద్ద అటు కరీంనగర్, ఇటు హైదరాబాద్ వైపు వెళ్లే మార్గాల్లో చాలా దూరం వరకు వాహనాలు నిలిచిపోయాయి.