తెలంగాణ భవిష్యత్తుపై .. లాల్ దర్వాజ భవిష్యవాణిలో మాతంగి అనురాధ

హైదరాబాద్, వెలుగు: పాపాలు పెరగడంతోనే వర్షాలు పడట్లేదని, ఆలస్యమైనప్పటికీ వానలు కురుస్తాయని మాతంగి అనురాధ భవిష్యవాణి వినిపించారు. బోనాల ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఓల్డ్ సిటీ లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయం వద్ద రంగం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అనురాధ భవిష్యవాణి వినిపించారు. వర్షాలు వచ్చాయంటే కుంభవృష్టేనని, ఎప్పటిలాగే ఓ దిక్కు మునిగిపోతుందని చెప్పారు. మరోదిక్కు మంచి జరుగుతుందని అన్నారు.

ఇచ్చిన మాట ఎట్ల మరిచిపోతరు?

లక్షలాది మంది వస్తుండటంతో గుడి సరిపోవట్లేదని, గుడిని పెద్దగా చేస్తామన్న వాగ్దానాన్ని తీర్చలేదని మాతంగి ఆగ్రహించారు. ఆ బాధ్యత ప్రజలదేనని చెప్పారు. తెల్ల కాగితం మీద నల్ల గీత రాసిచ్చినప్పటికీ ఎందుకు ముందుకెళ్లట్లేదని ప్రశ్నించారు. ఎంత పుణ్యం చేస్తే అంత మంచి జరుగుతుందని, ఎంత చెడు చేస్తే అంత పాపం పెరుగుతుందని చెప్పారు. మంచి పనికి ముందుండి నడిపిస్తానని, చెడుకి దూరంగా ఉంచడంతోపాటు శిక్షించే బాధ్యత కూడా తనదేనని చెప్పారు. ఆడపడుచులకు మంచి చేస్తానన్నారు. తన దగ్గర ఎంత కోపం ఉందో అంత శాంతం ఉందన్నారు. వందేండ్లుగా ఇక్కడే ఉన్నానని, ఈసారి వైభవంగా పూజలు చేశారని, ఎవరికీ ఏమీ కాకుండా చూసుకుంటానని మాటిచ్చారు. శ్రావణంలోనూ పూజలు చేయాలని సూచించారు.

ALSO READ:యూట్యూబర్‌‌‌‌‌‌‌‌ ఇంట్లో ఐటీ సోదాలు

ఘనంగా ఘటాల ఊరేగింపు..

బోనాల ఉత్సవాల్లో భాగంగా ఓల్డ్​ సిటీలో సోమవారం సాయంత్రం ఘటాల ఊరేగింపు వైభవంగా కొనసాగింది. హరిబౌలిలోని అక్కన్న మాదన్న దేవాలయం వద్ద సీపీ సీవీ ఆనంద్ జెండా ఊపి ఘటాల ఊరేగింపు ప్రారంభించారు. అంబారీపై కొలువుదీరిన అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. చార్మినార్​ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. అక్కన్న మాదన్న, లాల్​దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయాల నుంచి అంబారీ ఊరేగింపు ప్రారంభమైంది.

భవిష్యవాణి వినిపించిన జోగిని స్వర్ణలత

పంటలు పుష్కలంగా పండుతున్నాయని, చెట్లను కూడా పెంచాలని జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. మీర్ ఆలం మండి వద్ద సోమవారం రంగం కార్యక్రమం నిర్వహించారు. తనకు జరిగిన పూజలపై అమ్మవారు సంతృప్తి చెందినట్లు చెప్పారు. అందరిని రక్షిస్తానని అభయమిచ్చారు. ఈ ఏడాది కూడా వర్షాలకు కొదవలేదని, కోరినన్ని వర్షాలు ఉన్నాయని చెప్పారు.