BAN vs SL: టీ20ల్లో 36 బంతుల స్పెల్.. ధోనీ బౌలర్ ఇలా చేశాడేంటి

BAN vs SL: టీ20ల్లో 36 బంతుల స్పెల్.. ధోనీ బౌలర్ ఇలా చేశాడేంటి

శ్రీలంక యువ బౌలర్ మహీషా పతిరానా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఐపీఎల్ లో ధోనీ శిష్యుడిగా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో శ్రీలంక జాతీయ జట్టులోకి వచ్చి సత్తా చాటుతున్నాడు. తన పదునైన యార్కర్లతో బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టే ఈ యువ బౌలర్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. ధారాళంగా పరుగులు ఇవ్వడంతో పాటు అదనపు బంతులు వేస్తూ జట్టుకు పెద్ద సమస్యగా మారాడు. 

టీ20ల్లో 24 బంతుల్లో ముగించాల్సిన స్పెల్ ను ఏకంగా 36 బంతుల్లో పూర్తి చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరిగిన తొలి టీ20లో పతిరానా దారుణ బౌలింగ్ ప్రదర్శన చేశాడు. 4 ఓవర్లలోనే 56 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్ లో 10 వైడ్ బాల్స్ తో మూడు నో బాల్స్ వేశాడు. ఇలాంటి చెత్త స్పెల్ ను ప్రస్తుతం నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ధోనీ సమక్షంలోనే బౌలింగ్ బాగా వేస్తావా అని కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో శ్రీలంక గెలవడంతో పతిరానా బతికిపోయాడంటున్నారు. 

పతిరానా ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ఆడుతున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2023 సీజన్ లో చెన్నై జట్టు విజయాలు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మరి పతిరానా మళ్ళీ గాడిలో పడాలంటే ధోనీ రంగంలోకి దిగాల్సిందే అని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై శ్రీలంక 3 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 203 పరుగులకు పరిమితమైంది.