ఇండియా సూపర్ పవర్ అవుతుంటే.. పాకిస్థాన్ అడుక్కుతింటుంది : మౌలానా ఫజలుర్

ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ ఒకే రోజు స్వాతంత్ర్యం పొందాయని, కానీ నేడు ఆ రెండు దేశాల పరిస్థితులు వేర్వేరుగా ఉన్నాయని పాకిస్తాన్ రైట్ వింగ్ ఇస్లామిక్ లీడర్, జమైత్ ఉలేమా ఇ ఇస్లామ్ ఫజల్(జేయూఐఎఫ్) పార్టీ అధ్యక్షుడు మౌలానా ఫజలుర్ రెహమాన్ అన్నారు. పాక్ నేషనల్ అసెంబ్లీలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. భారత్ తో పాక్ ను పోలుస్తూ అక్కడి పాలకుల తీరును తప్పుపట్టారు. 

ఇండియాను, మన దేశాన్ని పోల్చి చూడండి. వాళ్లు, మనం ఒకే రోజు స్వాతంత్ర్యం పొందాం. కానీ నేడు వాళ్లు గ్లోబల్ సూపర్ పవర్​గా మారాలని కలలు కంటున్నరు. మనం మాత్రం దివాళా తీసిన దేశం అనే ముద్ర నుంచి తప్పించుకోవడం కోసం ప్రపంచాన్ని అడుక్కుంటున్నాం” అని ఫజలుర్ అన్నారు. ఇస్లామిక్ దేశంగా ఏర్పడిన పాకిస్తాన్ ఇప్పుడు లౌకిక దేశంగా మారిపోయిందని, రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన కౌన్సిల్ ఆఫ్ ఇస్లామిక్ ఐడియాలజీ(సీఐఐ) సిఫార్సులను అమలు చేయడంలో పాలకులు ఫెయిల్ అయ్యారని ఆయన ఫైర్ అయ్యారు. పాలకుల తీరు వల్లే పాక్ దివాళా తీసే స్థాయికి దిగజారిందన్నారు. ఇమ్రాన్ ఖాన్ ఆధ్వర్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీకి ఫజలుర్ మద్దతు పలికారు. గత ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, పీటీఐ పార్టీకి ర్యాలీ తీసే హక్కు ఉందన్నారు. 

ఐఎంఎఫ్ నుంచి మరో బెయిలౌట్ ప్యాకేజీ.. 

ఆర్థిక సంక్షోభంతో దివాళా తీసిన దేశంగా ముద్ర పడే స్థితిలో ఉన్న పాకిస్తాన్ కు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) మరో బెయిలౌట్ ప్యాకేజీని మంజూరు చేసింది. గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం పాక్ కు మొత్తం 3 బిలియన్ డాలర్ల రుణ సాయం చేసేందుకు ఐఎంఎఫ్ అంగీకరించింది. ఇప్పటివరకు రెండు విడతల్లో ఒక్కో సారి బిలియన్ డాలర్లకుపైగా రుణాలు మంజూరుచేసింది. తాజాగా మంగళవారం తుది విడతగా మరో 1.1 బిలియన్ డాలర్ల (రూ. 9.18 లక్షల కోట్లు) రుణాన్ని విడుదల చేసేందుకు ఓకే చెప్పింది. అయితే, దీర్ఘకాలిక గడువుతో మరింత పెద్ద మొత్తంలో బెయిలౌట్ ప్యాకేజీ ఇవ్వాలని ఐఎంఎఫ్​ను పాకిస్తాన్ కోరుతోంది.