
కళ్లముందే మృత్యువు తాండవం చేస్తుంటే.. దగ్గరగా వెళ్లివచ్చిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందిన వేళ.. బతికి బయటపడ్డవారు తమ అదృష్టం బాగుందని భావిస్తు్నారు. కొందరు ఈ దాడి నుంచి తృటిలో తప్పించుకుంటే.. కొందరు షెడ్యూల్ వలన దగ్గర్లోనే ఉండాల్సి వచ్చింది. చివరికి షెడ్యూల్ లేటుగా ఉండటం కలిసొచ్చిందని అనుకుంటున్నారు.
సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన కొందరు పర్యాటకులు జమ్మూ కాశ్మీర్ టూర్ కు వెళ్ళారు. వారిలో మెదక్ పట్టణంలోని కపిల్ చిట్స్ ఆఫీస్ మేనేజర్ పవన్ దంపతులు, ఏజెంట్ రామకృష్ణ దంపతులు ఉన్నారు. మంగళ వారం (ఏప్రిల్ 22) హైదరాబాద్ నుంచి ఫ్లైట్ లో జమ్మూ వెళ్ళారు. 10:30 అక్కడ ఫ్లైట్ దిగారు. మధ్యానం 2 గంటలకు జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్ళారు. 3 గంటలకు హోటల్ కు చేరుకున్నారు.
Also Read:-ఉగ్రదాడి పిరికి చర్య.. రేపు (ఏప్రిల్ 24) సీడబ్ల్యూ సీ అత్యవసర సమావేశం
కాసేపు సేదతీరాక తరువాత శ్రీనగర్ లోని తులిప్ గార్డెన్ వెళ్ళారు కపిల్ చిట్స్ ఉద్యోగులు. గురువారం (ఏప్రిల్ 24) పర్యాటక ప్రదేశమైన పహల్ గావ్ వెళ్ళే ప్రోగ్రామ్ ఉంది. అంతలోనే అక్కడ ఉగ్ర వాదులు 26 మంది పర్యాటకులను కాల్చి చంపారనే వార్త రావడంతో షెడ్యూల్ లేట్ గా ఉండటం వలన ఊపిరి పీల్చుకున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్లిన టూరిస్ట్ లు హోటల్ లోనే ఉండిపోయారు. ఉగ్రదాడి నేపథ్యంలో శ్రీనగర్ ప్రాంతం ఆర్మీ కంట్రోల్ ఉందని, కర్ఫ్యూ వాతావరణం నెలకొందని అక్కడున్న వారు తెలిపారు. ఫ్లైట్ దొరికితే హైదరాబాద్ తిరిగి వస్తామని చెప్పారు.