భర్త ఆత్మహత్యాయత్నం.. ఇద్దరు బిడ్డలతో కలిసి భార్య సూసైడ్

భర్త ఆత్మహత్యాయత్నం.. ఇద్దరు బిడ్డలతో కలిసి భార్య సూసైడ్
  • కుటుంబంలో గొడవలే కారణం
  • మెదక్ ​జిల్లాలో విషాదం 

మెదక్, వెలుగు: ఆత్మహత్యాయత్నం చేసిన భర్త దవాఖానలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా.. కలత చెందిన భార్య ఐదేండ్లలోపు ఇద్దరు కూతుళ్లతో సహా చెరువులో దూకి సూసైడ్​ చేసుకుంది. ఈ ఘటన మెదక్ జిల్లా కొంటూర్​లో మంగళవారం  జరిగింది. మెదక్​ డీఎస్పీ సైదులు కథనం ప్రకారం..మెదక్ మండలం వెంకటాపూర్​కు చెందిన లక్ష్మికి రామాయంపేట మండలం అక్కన్నపేటకు చెందిన కొక్కుల ఎల్లంతో ఏడేండ్ల కింద పెండ్లయ్యింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. తొమ్మిది రోజుల కింద భార్యాభర్తలిద్దరు గొడవ పడ్డారు. ఆవేశపడ్డ భర్త ఎల్లం పురుగుల మందు తాగాడు. అతడిని మెదక్​లోని ఓ ప్రైవేట్​హాస్పిటల్​కు తరలించగా చికిత్స పొందుతున్నాడు. వెంకటాపూర్​లోని తల్లిగారింట్లో ఉన్న లక్ష్మి (28)మంగళవారం హాస్పిటల్ లో ఉన్న భర్తను చూసేందుకు ఇద్దరు కూతుళ్లు శరణ్య (4), శ్రావ్య (3) లతో మెదక్ కు వచ్చింది. 

హాస్పిటల్​లో ఉన్న భర్తను చూసిన తర్వాత ఆటోలో వెంకటాపూర్​కు తిరిగి వెళ్లే క్రమంలో కొంటూరు వద్ద దిగింది. అక్కడి నుంచి వెంకటాపూర్​కు వెళ్లకుండా ఇద్దరు బిడ్డలతో సహా కొంటూర్​ పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారమివ్వగా మెదక్ డీఎస్పీ సైదులు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. చెరువులో నుంచి లక్ష్మి,శరణ్య, శ్రావ్య మృతదేహాలను వెలికి తీయించి పోస్టుమార్టం కోసం మెదక్​ జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మెదక్ రూరల్ ​పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​ రెడ్డి దవాఖానలో బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. అంత్యక్రియల కోసం ఆర్థిక సాయం చేశారు.