
మెదక్ జిల్లాలో ప్రజలకందని సత్వర వైద్య సేవలు
మెదక్/కౌడిపల్లి/చిలప్‌చెడ్, వెలుగు : గ్రామీణ ప్రాంత ప్రజలకు సత్వర వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం పల్లె దవాఖానాలు పెడుతోంది. కానీ మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు కట్టినవాటిని ప్రారంభించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో లక్షలు పెట్టి కట్టిన పల్లె దవాఖానా బిల్డింగులు ఉత్తిగానే ఉన్నాయి.
- చిలప్ చెడ్ మండల కేంద్రంతోపాటు ఫైజాబాద్, చిట్కుల్ గ్రామాల్లో కొన్ని నెలల కింద పల్లె దవాఖానా బిల్డింగ్ లు నిర్మించారు. ఒక్కో బిల్డింగ్‌కు రూ.16 లక్షల చొప్పున ఖర్చు చేశారు. కానీ ఇంకా ప్రారంభిస్తలేరు. ఈ భవనాలను జూన్ 8న తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీస్ అండ్ హెల్త్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మెదక్ జిల్లా డిప్యూటీ ఈఈ సుదర్శన్ రెడ్డి సందర్శించి పది రోజుల్లో పల్లె దవఖానాలను ప్రారంభిస్తామని చెప్పారు. కానీ నెలన్నర రోజులైనా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు.
- కౌడిపల్లి మండల కేంద్రంతోపాటు మహమ్మద్ నగర్, తునికి గ్రామాల్లో పల్లె దవాఖానాలు నిర్మించి ఆరు నెలలు అవుతోంది. అవి ఇప్పటికీ నిరుపయోగంగానే ఉన్నాయి. రెండు రోజుల కింద జరిగిన మండల జనరల్ బాడీ మీటింగ్‌లో ఆయా గ్రామాల సర్పంచ్పచులతోపాటు, ఎంపీపీ సైతం పల్లె దవాఖానాలకు బిల్డింగులు నిర్మించినా ఎందుకు ప్రారంభించడం లేదని అధికారులను నిలదీశారు.
- నార్సింగి మండల కేంద్రంలో రెండు, నర్సంపల్లిలో ఒకటి, చేగుంట మండలం గొల్లపల్లి, ఇబ్రహీంపూర్ గ్రామాల్లో కూడా పల్లె దవాఖానాలు నిర్మించారు. కట్టి నెలలు దాటుతున్నా ప్రారంభానికి మాత్రం నోచుకోవడం లేదు.
అందని వైద్య సేవలు
పల్లె దవాఖానాలు మంజూరు కావడంతో తమకు వైద్య సేవలు అందుబాగులోకి వస్తాయని ఆయా గ్రామాల ప్రజలు భావించారు. కానీ అవి ఉపయోగంలోకి రాకపోవడంతో నిరాశ చెందుతున్నారు. సీజల్ వ్యాధులు ప్రబలుతున్నందున వెంటనే పల్లె దవాఖానాలన్నింటినీ ప్రారంభించాలని ఆయా గ్రామాల ప్రజలు
కోరుతున్నారు.
జల్ది ఓపెన్ చేయాలి
గ్రామాల్లో దవాఖానాలు పెడుతున్నారంటే సంతోషించాం. కానీ బిల్డింగ్ లు కట్టి చాలా రోజులువున్నా ఇంకా ఓపెన్ చేస్తలేరు. గ్రామంలో ఎవరికి సుస్తీ అయినా జోగిపేట, నర్సాపూర్, మెదక్ దవాఖానాలకు పోవాల్సి వస్తోంది. జర గ్రామంలోని దవాఖానాను జల్ది ఓపెన్ చేయాలి
- పాండరి, చిలప్‌చెడ్ గ్రామస్తుడు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
కౌడిపల్లి మండలంలో నిర్మాణం పూర్తయి ప్రారంభం కాని పల్లె దవాఖానాల విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో ప్రారంభించే అవకాశం ఉంది. చిలప్ చెడ్, ఫైజాబాద్, చిట్కుల్ లో నిర్మించిన పల్లె దవాఖానా బిల్డింగులను ఏఈ హ్యాండోవర్ చేయలేదు.
- శ్రీకాంత్, మెడికల్ ఆఫీసర్, కౌడిపల్లి