- ఆయనకు మద్దతు ప్రకటించిన టీసీపీఎస్ఈఏ
హైదరాబాద్, వెలుగు: ఉపాధ్యాయులు, ఉద్యోగులకు శాపంగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసే వరకు పోరాటం చేస్తానని కరీంనగర్–ఆదిలాబాద్ – నిజామాబాద్ – మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజక వర్గ అభ్యర్థి మల్క కొమురయ్య స్పష్టం చేశారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్ రద్దు చేసి.. ఓపీఎస్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్లో తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టీసీపీఎస్ఈఏ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పుప్పాల కృష్ణ కుమార్, హన్మండ భాస్కర్ తదితరులు టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్యకు మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయనకు మద్దతు లేఖను అందించారు. సీపీఎస్ ఉద్యోగులంతా మల్క కొమురయ్యకు తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత సీపీఎస్ రద్దు కోసం పోరాడాలని ఆయన్ను కోరారు. ఈ సందర్భంగా మల్క కొమురయ్య మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుందని, అయినా ఇప్పటికీ ఆ హామీని నిలబెట్టుకోలేదని చెప్పారు. సీపీఎస్ విధానం రద్దు చేసుకునే అవకాశం రాష్ర్టాలకు కేంద్రం ఇచ్చిందని గుర్తు చేశారు. ఉద్యోగుల జీవితాలకు భద్రత లేని సీపీఎస్ విధానం రద్దు చేయాలని లేకపోతే.. ఎంతటి పోరాటానికైనా తాను సిద్ధంగా ఉంటానని వారికి హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హన్మంతరావు, ఇతర నాయకులు పాల్గొన్నారు.