
గిరిజనుల ఉనికిని కాపాడేందుకు పోరాడి వీర మరణం పొందిన సమ్మక్క, సారలమ్మ జాతర ఈనాటిది కాదు. ఓరుగల్లును ప్రతాపరుద్రుడు పాలించినప్పటి నుంచి చేస్తున్నట్లు స్థల పురాణాలు చెప్తున్నాయి. అప్పట్లో మేడారం ప్రాంతాన్ని పగిడిద్దరాజు పరిపాలించేవాడు. ఆయన కాకతీయులకు సామంతరాజు. అతని సతీమణి సమ్మక్క. వాళ్ల సంతానం సారలమ్మ, నాగులమ్మ, జంపన్న. ఓసారి మేడారం ప్రాంతంలో కరువు వచ్చింది. ప్రజలకు తినడానికి తిండి లేని పరిస్థితి తలెత్తింది. దాంతో ప్రజలు పన్నులు కట్టలేకపోయారు. అప్పుడు పగిడిద్దరాజు కాకతీయులకు కప్పం కట్టలేనని తేల్చి చెప్పాడు. దాంతో ప్రతాపరుద్రుడు అతనిపైకి సైనికులను పంపాడు. పగిడిద్దరాజు అతని కుమార్తెలు, అల్లుడు గోవిందరాజు కలిసి మేడారం సరిహద్దులోని సంపెంగ వాగు దగ్గర కాకతీయ సైన్యాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. కానీ.. యుద్ధంలో వీరమరణం పొందారు. జంపన్న సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటినుంచి సంపెంగ వాగును జంపన్నవాగుగా పిలుస్తున్నారు. తన కొడుకు, కూతురు చనిపోయారనే వార్త విన్న సమ్మక్క యుద్ధరంగానికి వచ్చి కాకతీయ సైనికులపై విరుచుకుపడింది. ఈటెలు, బల్లాలతో కాకతీయ సైన్యాలను పరుగులు పెట్టించింది. కానీ.. చివరకు శత్రువుల దాడిలో బాగా గాయాలైన సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధ భూమి నుంచి చిలుక గుట్టవైపు వెళ్లింది. వెళ్తూనే మార్గమధ్యంలో మాయమైంది. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారిపోయాడు.
గిరిజనులే పూజార్లు
సమ్మక్క, సారలమ్మ గద్దెల దగ్గర వంశ పారంపర్యంగా గిరిజనులే పూజార్లుగా కొనసాగుతున్నారు. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం(బెల్లం) నైవేద్యంగా సమర్పించుకుంటారు. గిరిజనుల ఆరాధ్య దైవమైనా.. మిగతా జనాలు కూడా అమ్మవార్లను దర్శించుకుంటారు. ప్రతిసారి సుమారు కోటి మందికి పైగా ఈ మహా జాతరకు వస్తారు. అందుకే ఆసియా ఖండంలోనే అతి పెద్ద జాతరగా పేరుగాంచింది. అంతేకాదు, కాలానికి తగ్గట్టు మేడారం జాతర మోడర్న్‌గా మారిపోయింది.
ఏడాదంతా జాతర
ప్రపంచంలో ఏ క్షేత్రంలో అయినా.. ఏడాదిలో ఒకేసారి కొన్ని రోజుల పాటు జాతర జరుగుతుంది. లేదంటే రెండేళ్లకోసారి, మూడేళ్లకోసారి జరుగుతుంటాయి. ఒకప్పుడు మేడారం జాతర కూడా అలానే జరిగేది. మారుతున్న కాలాన్ని బట్టి ఈ క్షేత్రం ఆచారాలు కూడా మారిపోయాయి. ఇప్పుడు ఇక్కడ 365 రోజులు జాతరలాగే అనిపిస్తుంది. 1962కు ముందు తాడ్వాయి మండలంలోని బయ్యక్కపేట గ్రామంలో రెండేళ్లకోసారి సమ్మక్క, సారలమ్మ జాతర జరిగేది. ఈ గ్రామాన్ని సమ్మక్క పుట్టినిల్లుగా గిరిజనులు చెప్తుంటారు. అప్పట్లో భక్తులు కూడా చాలా తక్కువగానే వచ్చేవాళ్లు. ఆ తర్వాత జాతరను మేడారంలో చేయడం మొదలుపెట్టారు. అమ్మవార్లను కూడా ఇక్కడే పూజిస్తున్నారు. ప్రతీ రెండేళ్లకోసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజు జాతర మొదలవుతుంది. నాలుగు రోజుల పాటు జాతర చేస్తారు. మొదటి రోజు సారలమ్మ గద్దెకు చేరుతుంది. రెండోరోజు సమ్మక్క గద్దెకు వస్తుంది. మూడో రోజు అమ్మవార్లకు మొక్కులు సమర్పిస్తారు. నాలుగో రోజు దేవతల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. 1996లో ఈ జాతరను అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. కొన్నేళ్ల తర్వాత మధ్యలో వచ్చే ఏడాది కూడా చిన్న జాతర నిర్వహించడం మొదలుపెట్టారు. ఇప్పుడు మహాజాతర, చిన్న జాతరలను నిర్వహిస్తున్నప్పటికీ భక్తుల రద్దీ మాత్రం ఏడాది పొడవునా ఉంటోంది. అమ్మవార్లను దర్శించుకోవడానికి ప్రతిరోజు భక్తులు మేడారానికి వస్తున్నారు. భక్తిభావంతో గద్దెల్ని మొక్కి తలనీలాలు ఇచ్చి, బెల్లం సమర్పించి వెళ్తున్నారు. గతంలో జాతర జరిగే నాలుగు రోజుల్లోనే భక్తులు మేడారంలో కనిపించేవాళ్లు. ఆ తర్వాత గుడి తలుపులు మూసేసేవాళ్లు. ఇప్పుడలా కాదు.. 365 రోజులు మేడారం గుడి తలుపులు తెరిచి ఉంటున్నాయి.
ఆ నాలుగు రోజులే కాకుండా..
గతంలో మేడారం గుడి బాగోగులు చూడడానికి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్ కూడా ఉండేది కాదు. జాతర జరిగే నాలుగు రోజుల పాటు ఆఫీసర్లు వచ్చి ఏర్పాట్లు చేసి వెళ్లిపోయేవాళ్లు. ఇప్పుడలా కాదు. మేడారంలో దేవాదాయ శాఖ వాళ్లు ఈవో ఆఫీస్ ఏర్పాటు చేశారు. స్పెషల్ ఆఫీసర్‌ని నియమించారు. ఆఫీసర్లు, సిబ్బంది ఏడాది పొడవునా అందుబాటులో ఉంటున్నారు. వచ్చి, పోయే భక్తులకు సేవలు అందిస్తున్నారు. అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నారు. భక్తుల కోసం భారీ షెడ్లు నిర్మించారు. టాయిలెట్స్ కట్టించారు. తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. వీటిన్నింటికోసం స్టేట్ గవర్నమెంట్ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. 2016 నుంచి ఇప్పటి వరకు 330 కోట్ల రూపాయలకు పైగా నిధులు ఖర్చు చేసి భక్తుల కోసం ఏర్పాట్లు చేశారు. జంపన్న వాగులో స్నానాల కోసం బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్, విడిది కోసం భారీ షెడ్లు కట్టించారు. ఒక్కో షెడ్డులో రెండు వేల మంది భక్తుల చొప్పున 5 షెడ్లల్లో ఒకే రోజు 10 వేల మంది భక్తులు విడిది చేసే సౌకర్యం కల్పించారు. వంట చేసుకోవడానికి కూడా ఇబ్బందుల్లేవు. దీంతో ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు అమ్మవార్ల గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లిస్తున్నారు.
ఎడ్ల బండి టు హెలికాప్టర్
మేడారం జాతర అనగానే ఎడ్లబండ్లు గుర్తొస్తాయి. ఎందుకంటే గతంలో చుట్టుపక్కల జిల్లాల వాళ్లు ఎడ్లబండ్ల మీదే జాతరకు వచ్చేవాళ్లు. జాతరకు వారం రోజుల ముందే ఊళ్ల నుంచి ఎడ్ల బండ్లు బయలుదేరేవి. సుమారు 10 రోజులకు సరిపడా వంట సామాగ్రి, బట్టలు తీసుకొని జాతరకు వచ్చేవాళ్లు. ఆ తర్వాత కొన్నాళ్లకు జీపులు, ఆటోలు, డీసీఎం వ్యాన్లు, లారీల్లో మేడారం రావడం మొదలైంది. ఇప్పుడు ఏకంగా హెలికాప్టర్లలో కూడా మేడారం వచ్చి మొక్కులు చెల్లిస్తున్నారు భక్తులు. ఇతర దేశాల నుంచి కూడా వచ్చి వనదేవతలను దర్శించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భక్తుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడుపుతోంది.
జాతర పుణ్యాన మారిన రోడ్లు
గతంలో మేడారం మహా జాతరకు వెళ్లాలంటే నరకం కనిపించేది. అన్నీ మట్టి రోడ్లే. గుంతలు పడి ఎడ్లబండ్లు కూడా సరిగా వెళ్లేవి కావు. జీపులు, ట్రాక్టర్లు అయితే ఎక్కడ పడితే అక్కడ బురదలో దిగబడిపోయేవి. ఇప్పుడు పరిస్థితిలో చాలా మార్పులు వచ్చాయి. మేడారం జాతర చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ చూసినా డబుల్ బీటీ రోడ్లే కనిపిస్తున్నాయి. జాతరకొచ్చే భక్తుల సంఖ్య పెరగడంతో గవర్నమెంట్ కొత్త రోడ్లు వేయించింది. ముందుగా సింగిల్ బీటీ రోడ్లు వేశారు. ఆ తర్వాత వాటినే డబుల్‌రోడ్లుగా మార్చారు. ప్రతిసారి మహా జాతరకు ముందు రోడ్ల మరమ్మతులు చేస్తున్నారు. దాంతో వెహికల్స్ రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగడంలేదు. జాతర సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రోడ్లతోపాటు రాష్ట్రంలోని మేడారం వెళ్లే రోడ్లన్నీ మరమ్మతు చేస్తున్నారు. ‘మేడారం జాతర పుణ్యమా అని మా రోడ్లు బాగుపడ్డాయి’ అంటూ చాలామంది మారుమూల గ్రామాల ప్రజలు చెప్తుంటారు.
సీసీ, డ్రోన్ కెమెరాల వాడకం
గతంలో పోలీసుల నిఘా చాలా తక్కువగా ఉండేది. తుపాకీలు, లాఠీలు పట్టుకుని మాత్రమే డ్యూటీ చేసేవాళ్లు. ఇప్పుడు నిఘా పెంచారు. ఐదారు జాతరల నుంచి పోలీసులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు. దొంగతనాలను అరికట్టడంతో పాటు ట్రాఫిక్‌ని కంట్రోల్ చేయడానికి ఈ కెమెరాలని వాడుతున్నారు. 2018 జాతర నుంచి డ్రోన్ కెమెరాల వాడకం కూడా పెరిగింది. ఆకాశం నుంచే నిఘా పెడుతున్నారు. భక్తులకు సేవలందించే విషయంలో సీసీ, డ్రోన్ కెమెరాలు పోలీసులకు చాలా ఉపయోగపడుతున్నాయి. ఈ సారి జాతరకు మేడారంలో 382 సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. దీంతో గద్దెల వద్ద తొక్కిసలాట జరగకుండా, క్యూలైన్లలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడడానికి పోలీసులకు ఈజీ అవుతుంది. ప్రతి మహా జాతరకు అడిషనల్ డీజీపీ స్థాయి ఆఫీసర్ కనుసన్నల్లో పదుల సంఖ్యలో ఐపీఎస్ ఆఫీసర్లతో పాటు ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, ఏఎస్సైలు, కానిస్టేబుళ్లు అంతా కలిపి 10 వేల మందికి పైగా పోలీసులు డ్యూటీ చేస్తున్నారు.
ట్రాఫిక్ కంట్రోల్‌కు వన్‌వే
వన్‌వే అనేది హైదరాబాద్, వరంగల్ వంటి సిటీల్లోనే కన్పిస్తుంది. అలాంటిది మహాజాతర జరిగే వారం రోజుల పాటు పోలీసులు ఇక్కడ కూడా వన్‌వే పెడుతున్నారు. మేడారం మహా జాతరకు వచ్చే భక్తుల సంఖ్య ఏటేటా పెరిగిపోయింది. కోటి మందికి పైగా భక్తులు వస్తున్నారు. వెహికల్స్ సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. దీంతో కొన్ని జాతరల నుంచి ట్రాఫిక్ జాం అయి భక్తులు ఇబ్బందులు పడ్డారు. రోడ్లపైనే గంటల పాటు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. లక్షలాది వెహికల్స్‌ని కంట్రోల్ చేయడంలో భాగంగా పోలీసులు 2016 జాతర నుంచి మేడారంలో వన్‌వే పద్ధతి తీసుకొచ్చారు. మేడారం వెళ్లే వెహికల్స్.. తిరిగి ఇంటికి వెళ్లే వెహికల్స్ వేర్వేరు వైపుల నుంచి వెళ్లాల్సి వస్తోంది. కేవలం ఆర్టీసీ, వీఐపీ, వీవీఐపీ వాహనాలకు మాత్రమే మినహాయింపు నిచ్చారు. మిగతావన్నీ వన్‌వే రూల్స్‌ను పాటించాల్సిందే. లేకపోతే పోలీసులు చర్యలు తీసుకుంటారు. మిగతా రోజుల్లో ట్రాఫిక్ రూల్స్ ఏమీ ఉండవు. భక్తులు ఏ రూట్‌నుంచైనా మేడారం వెళ్లి మొక్కులు సమర్పించొచ్చు.
జాతర టైంలో వెహికల్స్ వెళ్లే రూట్లు
మహా జాతర సమయంలో వరంగల్, హన్మకొండ మీదుగా వచ్చే ప్రైవేట్ వెహికల్స్ ములుగు, పసర, నార్లాపూర్ మీదుగా మేడారం చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో నార్లాపూర్, బయ్యక్క పేట, గోళ్ల బుద్ధారం– కమలాపురం క్రాస్ మీదుగా భూపాలపల్లి, రేగొండ, పరకాల, గుడేపాడ్ మీదుగా హన్మకొండకు చేరుకుంటారు. గోదావరిఖని, మంచిర్యాల, పెద్దపెల్లి, మహారాష్ట్ర, కాళేశ్వరం, కాటారం మీదుగా వచ్చే వాహనాలు, భూపాలపల్లి, ములుగు ఘన్‌పూర్, జంగాల పల్లి నుంచి పసర, నార్లాపూర్ మీదుగా మేడారం చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో నార్లాపూర్, బయ్యక్కపేట, కమలాపురం క్రాస్ నుంచి కాటారం లేదా కాల్వపల్లి, సింగారం, బోర్లగూడెం, పెగడ పల్లి, చింతకాని మీదుగా కాటారం చేరుకుంటాయి. ఛత్తీస్‌గఢ్, భద్రాచలం, మణుగూరు నుంచి వచ్చే వెహికల్స్ ఏటూరు నాగారం, చిన్న బోయినపల్లి, కొండయి, ఉరట్టం మీదుగా మేడారం చేరుకుని, తిరుగు ప్రయాణంలో ఇదే దారిలో వెళ్ళిపోతారు. మహబూబాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ నర్సంపేట మీదుగా ములుగు మండలం మల్లంపల్లి హైవే దగ్గర కలిసి, ములుగు, పసర, నార్లాపూర్, మీదుగా, మేడారం చేరుకుని తిరుగు ప్రయాణంలో నార్లాపూర్, కమలాపూర్ క్రాస్, భూపాలపల్లి, పరకాల, గుడెప్పాడ్ మీదుగా మళ్ళీ మల్లంపల్లి మీదుగా తమ గమ్య స్థానాలకు చేరుకుంటారు.
పార్కింగ్ స్థలాలు
ఒకప్పుడు మేడారం జాతరకు వచ్చే వెహికల్స్ ఇష్టమున్న దగ్గర ఆపేవాళ్లు. ఇప్పుడు వాహనాలను గవర్నమెంట్ కేటాయించిన పార్కింగ్ ప్లేస్‌లోనే ఆపాలి. లేకపోతే ఫైన్ వేస్తారు. పస్రా, తాడ్వాయి, భూపాలపల్లి రూట్లలో వాహనాల పార్కింగ్ కోసం మేడారం జాతర పరిసర ప్రాంతాల్లో 33 చోట్ల పార్కింగ్ ప్లేస్‌లు ఏర్పాటు చేశారు. ఇందుకోసం 1,100 ఎకరాలకు పైగా స్థలాన్ని కేటాయించారు. పార్కింగ్ స్థలంలోనే మూత్రశాలలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నారు. మంచినీటి వసతి కూడా ఉంటుంది. ఇన్, ఔట్‌లెట్లు ఉంటాయి. లైట్ల వెలుతురు కూడా బాగుంటుంది. ఆర్టీసీ బస్సులకు, వీఐపీ, వీవీఐపీలకు వేర్వేరు చోట్ల పార్కింగ్ ప్లేస్‌లు ఏర్పాటు చేశారు.
డిజిటల్ హుండీలు
మేడారంలో 2022 మహా జాతర సందర్భంగా దేవాదాయ శాఖ డిజిటల్ హుండీలను ఏర్పాటు చేసింది. క్యూ ఆర్ కోడ్ ద్వారా డబ్బులు ఇచ్చి భక్తులు మొక్కులు చెల్లించుకోవచ్చు. ఈ మేరకు మేడారం టెంపుల్ పరిసరాల్లో 20 డిజిటల్ హుండీలను ఏర్పాటు చేయడానికి ఆఫీసర్లు సిద్ధమయ్యారు. కెనరా బ్యాంకు సాయంతో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి వనదేవతలను దర్శించుకునే భక్తులు డబ్బు, బంగారం, వెండి కానుకలను హుండీలో వేసి మొక్కులు చెల్లించుకునేవాళ్లు. ఇప్పుడు భక్తులు డబ్బులు తీసుకురావాల్సిన అవసరం లేదు. సెల్ ఫోన్‌లోని ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం లాంటి యాప్స్ ద్వారా క్యూ ఆర్‌కోడ్ స్కాన్ చేసి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోవచ్చు. కరోనా థర్డ్ వేవ్ రోజులు కనుకఈ సరికొత్త విధానాన్ని మొదలుపెట్టారు.
గిరిజన కల్చర్
మేడారం జాతర గిరిజనుల కల్చర్, ఆచారాలతో జరుగుతోంది. అయితే.. ఇప్పుడు ఆ ఆచారాల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చారు. ‘‘మోడర్న్ మేడారం’’గా మారుస్తున్న స్టేట్ గవర్నమెంట్ గిరిజనుల ఆచారాలను పట్టించుకోవడం లేదు. సమక్క, సారలమ్మ జాతరపై పట్టు పెంచుకుంటున్న దేవాదాయ శాఖ ఆఫీసర్లు కోయ గిరిజన పూజారులను పట్టించుకోవట్లేదు. దీంతో జాతర సమయంలో గొడవలు జరుగుతున్నాయి. పోయినసారి జాతరలో గవర్నమెంట్ ఆఫీసర్లు కొందరు గిరిజన పూజారులతో అమర్యాదగా ప్రవర్తించడంతో గిరిజన పూజారులు అలిగారు. దాంతో సారలమ్మను గద్దెపైకి చేర్చడంలో నాలుగు గంటలు ఆలస్యం అయ్యింది. స్టేట్ ఆఫీసర్లు ఎంత మొత్తుకున్నా గిరిజన పూజారులు తగ్గలేదు. ములుగు ఎమ్మెల్యే సీతక్క జోక్యం చేసుకుని వాళ్లను సముదాయించాల్సి వచ్చింది. సమ్మక్క తల్లి నెలవైన చిలుకల గుట్టకు రక్షణ కరువైంది. గుట్ట చుట్టూరా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంలో గవర్నమెంట్ ఫెయిలైంది. దీంతో పోకిరీలు గుట్టపైకి వెళ్తుండటంతో గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేడారం మహాజాతర –2022 నిర్వహణ బోర్డు మెంబర్లుగా గవర్నమెంట్ ఈ మధ్య 14 మందిని నియమించింది. వాళ్లలో తొమ్మిది మంది గిరిజనులే కాదు. మేడారం జాతరతో సంబంధం లేని వాళ్లను ట్రస్టు బోర్డు సభ్యులుగా నియమించడంపై గిరిజనులు మండిపడుతున్నారు.
చిలకలగుట్ట చుట్టూ కంచె ఏర్పాటు చేయాలి
జాతర నిర్వహణలో పూజారులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. చిలకల గుట్ట చుట్టూ కంచె ఏర్పాటు చేయాలి. జాతర నిర్వహణ బాధ్యతలు ఐటీడీఏకు అప్పగించాలి. జాతర సమయంలో రెండో పంట నష్టపోతున్న రైతులకు నష్ట పరిహారం ఇప్పించాలి. జాతర నిర్వహణలోశాశ్వత పనులు చేపట్టాలి. అభివృద్ధి పనులను ఐటీడీఏల ద్వారా స్థానిక ఆదివాసులకు కేటాయించాలి.
- కబ్బాక శ్రావణ్ కుమార్, తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి, ములుగు జిల్లా
ఆదివాసీలతోనే బోర్డు
మేడారం జాతర ట్రస్ట్ బోర్డులో చైర్మన్‌తో పాటు డైరెక్టర్లుగా ఆదివాసులనే నియమించాలి. ఆదివాసుల ఆచార సంప్రదాయాల ప్రకారమే జాతర జరగాలి. ఆదివాసీలు పూర్వం ఎలాగైతే సమ్మక్క, సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజులకు సంప్రదాయ పూజలు జరిపించారో అదే విధంగా జరిపించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కానీ కొన్ని సందర్భాల్లో సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఆదివాసుల హక్కులను కాలరాసే విధంగా గవర్నమెంట్ పనిచేస్తోంది.
- వంక నరేష్, గిరిజనుడు, ఏటూరునాగారం
::: అల్లం హరి వెంకటరమణ జయశంకర్ భూపాలపల్లి, వెలుగు