- మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి
పంజాగుట్ట, వెలుగు: బుక్ఫెయిర్లో జరిగింది ఆకస్మిక దాడి కాదని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. సమూహ సెక్యులర్ రైటర్స్ఫోరం, తెలంగాణ ఫర్ పీస్ అండ్ యూనిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ‘పుస్తక రచన, ప్రచురణ, విక్రయాలపై మతోన్మాద శక్తుల దాడిని ఖండిద్దాం’ అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. శ్రీనివాస్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్న శక్తులే.. భావ ప్రకటన స్వేచ్ఛపై దాడికి పూనుకుంటున్నాయన్నారు.
ఇది ఓ పద్ధతి ప్రకారం సాగుతున్న వ్యవహారమన్నారు. ప్రజాస్వామ్య భావాలున్న వారంతా ఏకమై ఎదుర్కోకపోతే పెద్ద ప్రమాదం తప్పదన్నారు. డిసెంబరు 29న బుక్ఫెయిర్లో వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ పై జరిగిన దాడిని రచయితలు, కవులు, మేధావులు ఖండించారు. ప్రొఫెసర్హరగోపాల్ మాట్లాడుతూ.. తెలంగాణలోని ప్రజాస్వామ్య శక్తులంతా ఐక్యంగా ఉండాలన్నారు. మహిళా రయితలు మాట్లాడుతూ కొంతమంది మహిళా రచయితల ఫొటోలను మార్ఫింగ్ చేసి బూతు బొమ్మలుగా చిత్రీకరించి ట్రోలింగ్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్జర్నలిస్టులు కె.శ్రీనివాస్, అల్లం నారాయణ, కవి శివారెడ్డి, పీఓడబ్ల్యూ సంధ్య, రెహ్మాన్, స్టాలిన్, కృపాకర మాదిగ తదితరులు మాట్లాడారు.