వైద్య శాఖలో ఖాళీలు నింపుతం : మంత్రి దామోదర రాజనర్సింహ

వైద్య శాఖలో ఖాళీలు నింపుతం : మంత్రి దామోదర రాజనర్సింహ
  • త్వరలో నోటిఫికేషన్ ఇస్తాం 
  • మరో 6 నెలల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణాలు​ పూర్తి
  • మెడికల్ బిల్లులపై  మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని హాస్పిటల్స్, మెడికల్​ కాలేజీల్లో ​80 శాతం స్టాఫ్​ను  రిక్రూట్​ చేయాల్సి ఉందని, రెండు మూడు నెలల్లో వాటిని భర్తీ చేస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఆ పోస్టుల భర్తీ కోసం ఏప్రిల్,​ మే నెలలో నోటిఫికేషన్​ జారీచేస్తామన్నారు. శనివారం అసెంబ్లీలో మెడికల్  బిల్లులపై  మంత్రి మాట్లాడారు. ప్రొఫెసర్ల సంఖ్య తక్కువగా ఉందని, నేరుగా ప్రొఫెసర్లను నియమించుకోవాలంటే చట్ట సవరణ చేయాల్సి  ఉంటుందన్నారు. ఆసుపత్రుల్లో సూపరింటెండెంట్​ పోస్టులు భర్తీ పెండింగ్​లో ఉన్నాయని వెల్లడించారు.

600 ప్రొఫెసర్లతో పాటు 2,900 అసిస్టెంట్ ​ ప్రొఫెసర్ల పోస్టులు, 332 నర్సింగ్  పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిలో 2,077 ఉద్యోగాలను మే నెలలో భర్తీ చేస్తామని పేర్కొన్నారు. త్వరలో నాన్​ టీచింగ్​స్టాఫ్​ 195 పోస్టులు కూడా భర్తీ చేస్తామన్నారు. అలాగే, సూపర్​ స్పెషాలిటీ హాస్పిటల్స్​ నిర్మాణాన్ని 6  నుంచి 8 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. కొత్తగా రూ.2700 కోట్లతో 26 ఎకరాల్లో ఉస్మానియా హాస్పిటల్​ నిర్మిస్తున్నామని, త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. నర్సింగ్​ కీలకపాత్ర పోషిస్తున్న నేపథ్యంలో మరో 16 నర్సింగ్​ కాలేజీలు, 29 పారామెడికల్​ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

40 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్

హైవేలో గోల్డెన్​ అవర్​లో ప్రమాదానికి గురైన వారిని కాపాడేందుకు 40 కిలోమీటర్లకు ఒకటి చొప్పన 70 ట్రామా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి చెప్పారు. అంబులెన్సుల​సంఖ్య పెంచుతామని, అర్దగంటలో బాధితులను ట్రామా సెంటర్లకు చేర్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. డయాలిసిస్​ సెంటర్లలో వ్యాస్క్యులర్​ యాక్సెస్​ సెంటర్లు, పీహెచ్​సీల సంఖ్యను పెంచుతామని తెలిపారు. ఫర్టిలైజేషన్​ కాస్ట్​లీగా ఉందనీ, ఈ నేపథ్యంలో బాధ్యత తీసుకుని ఐవీఎఫ్​ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. 

పదేండ్లలో నిర్లక్ష్యం: కూచుకుల రాజేశ్‌ రెడ్డి 

గత పదేళ్లలో వైద్య, ఆరోగ్య శాఖను నాటి బీఆర్ఎస్  ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని నాగర్ కర్నూల్  ఎమ్మెల్యే కూచుకుల రాజేష్  రెడ్డి విమర్శించారు. ఆరోగ్యశ్రీని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచి ప్రభుత్వం మళ్లీ జీవం పోసిందన్నారు. రాష్ట్రంలో కొత్తగా 400 ఎంబీబీఎస్  సీట్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. దీంతో మెడికల్​ సీట్ల సంఖ్య 3,690 నుంచి 4,090కి పెరిగిందని చెప్పారు.