
- హెచ్‌సీయూ స్టాఫ్, పర్యావరణవేత్తలతో మీనాక్షి నటరాజన్ మీటింగ్
హైదరాబాద్, వెలుగు: పర్యావరణ పరిరక్షణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం 12 నుంచి సాయంత్రం 7 గంటల వరకు హెచ్‌సీయూ భూముల వివాదంపై హెచ్‌సీయూ టీచింగ్, నాన్ టీచింగ్, పర్యావరణ వేత్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ వివిధ వర్గాల వారితో భేటీ అయి వారి అభిప్రాయాలు సేకరించారు. ఇందులో సుమారు 100 మంది వరకు పాల్గొనగా.. మీనాక్షి నటరాజన్ తో పాటు మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి లింగం యాదవ్ హాజరయ్యారు.
సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, ఇక్కడి విద్యార్థులు, పర్యావరణ వేత్తలు, సామాజిక కార్యకర్తలు అభిప్రాయం మేరకు కాంగ్రెస్ నడుచుకుంటుందన్నారు. మీరు చెప్పిన విషయాలను అన్నింటినీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ముందు ఉంచుతామని ఆమె వారికి హామీ ఇచ్చారు.
కాగా, హెచ్‌సీయూ విద్యార్థులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, వివాదంలో ఉన్న 400 ఎకరాల భూమిని కూడా హెచ్‌సీయూ పరిధిలోకి తీసుకురావాలని, ఇక్కడ జరుగుతున్న పనులను వెంటనే ఆపేయాలని, ఎకో పార్క్ ను అభివృద్ధి చేస్తానంటున్న ప్రభుత్వం.. 400 ఎకరాల భూమిని కూడా అందులో కలపాలని వారు డిమాండ్ చేశారు. పర్యావరణ వేత్త కిరణ్ విస్సా మాట్లాడుతూ.. హెచ్‌సీయూ భూ వివాదంలో వాస్తవాలను ప్రభుత్వం తెలుసుకొని హైదరాబాద్ భవిష్యత్‌ను కాపాడాలని కోరారు. ఇక్కడ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర సర్కార్ కు తగిన సూచనలు చేయాలని పర్యావరణ వేత్తలు కోరారు.