ఈ నెలాఖరుకు పీసీసీ కార్యవర్గం

ఈ నెలాఖరుకు పీసీసీ కార్యవర్గం
  • మిగిలిన నామినేటెడ్ పదవుల భర్తీ కూడా
  • కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ రాష్ట్ర ఇన్​చార్జ్ మీనాక్షి నటరాజన్
  • నియోజకవర్గాల వారీగా నేతల పనితీరుపై నివేదిక
  • పార్టీలో కనీసం పదేండ్ల సీనియార్టీ ఉన్న నేతలకే చాన్స్?

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియడంతో రాష్ట్ర కాంగ్రెస్ లో అందరి దృష్టి పీసీసీ కార్యవర్గం, మిగిలిపోయిన నామినేటెడ్ పదవుల భర్తీపై పడింది. ఈ నెలాఖరులోగా లేదంటే వచ్చే నెల మొదటి వారంలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలనే పట్టుదలతో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్​చార్జ్ మీనాక్షి నటరాజన్ ఉన్నారు. వాస్తవానికి గత నెల మొదటి వారంలోనే పీసీసీ కార్యవర్గ ప్రకటన వెలువడాలి. అంతా ఓకే అయిన సమయంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి రావడంతో వాయిదా పడింది. 

ఈ నెలాఖరు వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉన్నందున సీఎం రేవంత్, పీసీసీ చీఫ్​మహేశ్ గౌడ్, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు ఆ పనుల్లో బిజీలో ఉన్నా.. మీనాక్షి నటరాజన్ మాత్రం పీసీసీ కార్యవర్గంపై కసరత్తు స్పీడప్ చేశారు. ఈ సమావేశాలు ముగియగానే ఆమె రాష్ట్ర టూర్ ను ఖరారు చేసుకొని పీసీసీ నాయకత్వంతో ఫైనల్ గా చర్చించి ప్రకటించే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. ఈ నెల 27 తో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నందున, ఈ నెల 29 లేదంటే, వచ్చే నెల మొదటి వారంలో  ప్రకటించే అవకాశముందని అంటున్నాయి.

నియోజకవర్గాల నుంచి నివేదికలు

రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ గా ఇటీవల బాధ్యతలు తీసుకున్న మీనాక్షి నటరాజన్ అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ నేతల పనితీరు, వారి సీనియార్టీపై నివేదికలు తెప్పించుకొని స్వయంగా పరిశీలిస్తున్నారు. పీసీసీ కార్యవర్గంలో అయినా, మిగిలిపోయిన నామినేటెడ్ పదవుల భర్తీలో అయినా నాయకులకు అవకాశం కల్పించాలంటే కనీసం పదేండ్ల సీనియార్టీని, వారి పనితీరును ప్రతిపాదికగా తీసుకుంటామని మీనాక్షి నటరాజన్ స్పష్టం చేయడంతో ఇప్పుడు అలాంటి వారికే అవకాశం దక్కనుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కూడా ఈ అంశానికే ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టమవుతున్నది.

 ఇదే ఫార్ములాను పీపీసీ కార్యవర్గ నియామకంలో, నామినేటెడ్ పదవుల భర్తీలో పాటించే విషయంలో ఇన్​చార్జ్ మీనాక్షి నటరాజన్ పూర్తి స్పష్టతతో ఉన్నారు. కాగా, అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరిన వారు, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు, ఇతర నేతలు.. వారి అనుచరులకు పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ప్రాధాన్యత ఇచ్చే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. పీసీసీ నాయకత్వంతో మరోసారి ఆమె చర్చిస్తే తప్ప వలస నేతలకు పదవులు వచ్చే అవకాశం లేదని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి.