భద్రతా సమావేశాలకు చైనా డుమ్మా
బీజింగ్: అఫ్గానిస్తాన్‌పై ఇండియా ఏర్పాటు చేసిన ‘ఢిల్లీ రీజినల్ సెక్యూరిటీ డైలాగ్ ఆన్ అఫ్గాన్’(జాతీయ భద్రతా సలహాదారుల)సమావేశానికి అటెండ్ కావడం సాధ్యం కాదని చైనా తేల్చి చెప్పింది. షెడ్యూలింగ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని వెల్లడించింది. ‘‘షెడ్యూల్ కారణాల వల్ల ఢిల్లీ సమావేశానికి అటెండ్ కావడం కుదరడం లేదు”అని చైనా ఫారిన్ మినిస్ట్రీ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ చెప్పారు. కాగా, అఫ్గాన్‌లో తాలిబాన్ల పాలన మొదలైనప్పటి నుంచి ఆ దేశం టెర్రరిస్టులకు అడ్డాగా మారకుండా ఉండేందుకు ఇండియా సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఇందులో భాగంగానే అఫ్గాన్ పొరుగు దేశాలతోపాటు, రష్యా, ఇరాన్ దేశాల ప్రతినిధులతో ఇండియా బుధవారం ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది. ఇందుకు చైనాకు, పాకిస్తాన్ తదితర దేశాలకు ఆహ్వానం పంపింది. ఈ సమావేశానికి రాబోమని పాకిస్తాన్ ఇప్పటికే వెల్లడించింది.
భద్రతా వ్యవస్థ ఏర్పాటు కోసమే
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షతన జరగనున్న ఈ మీటింగ్‌లో మధ్య ఆసియా దేశాలైన కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్లతో పాటు రష్యా, ఇరాన్‌కు చెందిన సెక్యూరిటీ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొంటారు.