
భూపాలపల్లి రూరల్, వెలుగు: యువత అందివచ్చిన ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రమైన భూపాలపల్లి పుష్ప గ్రాండ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత ఉపాధి కోసం ఇతర జిల్లాలకు సైతం వెళ్లాలని సూచించారు. మన కలెక్టర్ పంజాబ్ నుంచి, ఎస్పీ మహారాష్ట్ర నుంచి వచ్చి జిల్లాలో ఉద్యోగం చేస్తున్నారని, యువత ఉన్న చోటనే ఉద్యోగం చేయాలన్న ధోరణి విడనాడాలని సూచించారు.
జిల్లాలో సింగరేణి ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్య కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఆసక్తి ఉన్న రంగంలో నైపుణ్యం సాధించడానికి శిక్షణా కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలోనూ ఉద్యోగావకాశాలను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. 80కి పైగా వివిధ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొని నైపుణ్యాలను బట్టి ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. అనంతరం మెగా జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులను టాస్క్ సీఈవో శ్రీకాకాంత్ సిన్హా, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే చేతుల మీదుగా అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ 80 పరిశ్రమ లు జాబ్ మేళాలో పాల్గొన్నారని, 10 వేల మందికి పైగా నిరుద్యోగులు ఆన్లైన్ ద్వారా నమోదు అయినట్లు తెలిపారు.