
- ప్రత్యేక కమిషన్, పోలీస్ స్టేషన్లూ పెట్టాలి
- ఢిల్లీ జంతర్ మంతర్ లో ‘పురుషుల సత్యాగ్రహ’ దీక్ష
- ‘సేవ్ ఇండియన్ ఫ్యామిలీ’ పేరుతో ఆందోళన
- తెలంగాణ, ఏపీ నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొన్న బాధితులు
న్యూఢిల్లీ, వెలుగు: మహిళలతో సమానంగా మగాళ్లనూ గుర్తించాలని, మగవాళ్లకు ప్రత్యేక కమిషన్, పోలీస్ స్టేషన్లు పెట్టాలంటూ భార్యా బాధితులు చేసిన నినాదాలతో ఢిల్లీలోని ధర్నా చౌక్ దద్దరిల్లింది. భార్యలు పెడుతున్న హింస నుంచి పురుషులను కాపాడాలంటూ వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భార్యా బాధితులు డిమాండ్ చేశారు. చట్టాల పేరుతో మహిళలు పెడుతున్న గృహహింస నుంచి రక్షించాలని కేంద్ర ప్రభుత్వానికి వారు మొరపెట్టుకున్నారు.
శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సేవ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘సేవ్ ఇండియన్ ఫ్యామిలీ మూవ్‌మెంట్’ పేరుతో పురుషులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ నిరసనకు భార్యా బాధితుల సంఘం కూడా మద్దతు తెలిపింది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 2 వేలకు పైగా బాధితులు ఈ నిరసనలో పాల్గొని సంఘీభావం తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ బాషాతో పాటు వందలాది మంది భార్యా బాధితులు, వారి కుటుంబ సభ్యులు కూడా ధర్నాలో పాల్గొన్నారు.
వరకట్నం కేసులో భర్త కుటుంబ సభ్యులను దోషులుగా పరిగణించరాదని భార్యా బాధితులు డిమాండ్ చేశారు. ఆ దిశలో పురుషులకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలన్నారు. వరకట్నం కేసులో భార్య, భర్త ఇద్దరూ దోషులేనని అన్నారు. భార్య జీతంలో భర్తకూ హక్కు ఉండాలని, భార్యాభర్తలు ఇద్దరు సమానమేనన్నారు. 498 (ఏ) గృహహింస చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ చట్టాల పేరుతో ఫిర్యాదు చేయగానే.. వెంటనే కేసులు నమోదు చేయకుండా, తొలుత విచారణ జరపాలన్నారు.
చట్టాలు సమానంగా ఉండాలి: బాలాజీ
ధర్నాలో భార్యా బాధితుల సంఘం జాతీయ అధ్యక్షుడు బాలాజీ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో మగవాళ్ల హక్కుల కోసం ప్రత్యేక చట్టాలు అవసరమన్నారు. గృహహింస, ఇతర చట్టాల కింద అక్రమ కేసుల్ని బనాయించి బతుకుపైనే విరక్తి కలిగేలా కొందరు ఆడవాళ్లు వ్యవహరిస్తున్నారన్నారు. ఈ అక్రమ కేసుల్లో కోర్టుల వాయిదాలకు తిరిగలేక ఉద్యోగాలతో పాటు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళల రక్షణ కోసం రూపొందించిన చట్టాలతోనే అత్త, ఆడపడచులను కోడళ్లు వేధిస్తున్నారని చెప్పారు. అందుకే మహిళల మాదిరిగానే పురుషులకు కూడా ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆడ, మగ ఎవరైనా చట్టాలు సమానంగా ఉండాలన్నారు. రాజకీయ పార్టీలు సైతం తమకు అండగా నిలవడంలేదని, అందుకే ‘ప్రజా యువశక్తి పొలిటికల్ పార్టీ’ కూడా పెట్టామన్నారు.
‘షీ’ టీంలలాగే.. ‘హీ’ టీంలు పెట్టాలి: శేఖర్ బాషా
మహిళలకు రక్షణ కల్పించేందుకు ఏర్పాటు చేసిన ‘షీ’ టీంల మాదిరిగానే.. పురుషుల కోసం ‘హీ’ టీంలు పెట్టాలని బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ బాషా డిమాండ్ చేశారు. భార్యా బాధితులకు రక్షణ కల్పించేలా చట్టాల్లో మార్పులు చేయాలన్నారు. ఆడ, మగ అనే తేడా లేకుండా చట్టాలు ఉండాలని.. అందుకోసం భార్య, భర్త అని కాకుండా స్పౌజ్ అని చట్టాల్లో మార్పులు చేయాలన్నారు. 498(ఏ), 376, 493, పోక్సో చట్టాలను వాడుకొని మగవారిని మహిళలు హింసిస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు.
ఈ అక్రమ కేసులతో పురుషులు దిక్కులేక ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత చట్టాలతో కోడలు అత్తపై కేసు పెట్టవచ్చు కానీ.. కోడలుపై అత్త కేసు పెట్టేందుకు అవకాశం లేదన్నారు. మహిళ అంటే భార్య మాత్రమే కాదని.. అత్త, ఆడపడుచులు కూడా మహిళేనన్న విషయాన్ని భార్యలు గుర్తించాలన్నారు.