
తెలంగాణలో రోజురోజుకు ఎండలు మండుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలకు అలెర్ట్స్ జారీ చేసింది వాతావరణ శాఖ. అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడ గాలులు వీచే అవకాశం ఉందని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీచేసింది.
మార్చి 16 నుంచి వచ్చే మూడు రోజుల పాటు ఎండలు మరింత పెరగనున్నాయని తెలిపింది. మార్చి 20 వరకు ఎండల తీవ్రతతో పాటు రాష్ట్రంలో అక్కడక్కడ వడ గాలులు వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎఫెక్ట్ అధికంగా ఉండే అవకాశం ఉంది. ఈ రోజు అదిలాబాద్, కొమురం భీమా అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ ,జగిత్యాల రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలతో పాటు అక్కడ వడగాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. మధ్యాహ్నం 11 గంటల నుంచి మూడున్నర గంటల మధ్య అవసరముంటేనే బయటకు రావలని సూచించింది.
Also Read :- ఉగాది పండుగ ఎప్పుడు.. కొత్త సంవత్సరం పేరు ఇదే..!
మార్చి 15న తెలంగాణలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొమరం భీం జిల్లాలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. అదిలాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల వనపర్తి, నాగర్ కర్నూల్, జగిత్యాల , సిద్దిపేట జిల్లాలో 41 డిగ్రీల పైనే గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. మిగతా అన్ని జిల్లాలో దాదాపు 39 నుంచి 40 డిగ్రీల మధ్యన నమోదయ్యాయి. హైదరాబాద్లో మార్చి 15న 39.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి..