తెలంగాణలో 4 రోజుల పాటు వానలు .. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలో 4 రోజుల పాటు వానలు .. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 4 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్  జారీ చేసింది. శనివారం నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ ​ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్​ జారీ చేసింది. 

ఆదివారం రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. అలాగే సోమ, మంగళవారాల్లో జయశంకర్​ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్,  హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్​ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్​నగర్, నారాయణపేట, నిజామాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్​ జారీ చేసింది. 

పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు

నల్గొండ, రంగారెడ్డి, నాగర్​కర్నూల్, నారాయణపేట, వికారాబాద్, హైదరాబాద్​లో శుక్రవారం మోస్తరు వర్షాలు కురిశాయి. హైదరాబాద్​లోని కంచన్​బాగ్​లో అత్యధికంగా 4.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతా నగర్​లో 4.4, హైదరాబాద్​లోని కందికల్​ గేట్​లో 3.9, నల్గొండ జిల్లా ముదిగొండలో 3.4, నారాయణపేట జిల్లా ధన్వాడలో 3.3, హైదరాబాద్​లోని ఇందిరానగర్​ కమ్యూనిటీ హాల్​లో 3.1, ఆసిఫ్​నగర్​లో 3, బార్కస్​లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.