దేశంలో ఇప్పటి వరకు భూమి మీద నడిచే మెట్రో రైలును చూశాం..ఆకాశ మార్గంలో (ఫ్లై ఓవర్లపై) వెళ్లే మెట్రో రైళ్లోనూ ప్రయాణించాం. అంతేకాదు భూమి లోపల(అండర్ గ్రౌండ్) మెట్రో రైలు పరుగులు పెట్టడం గమనించాం. కానీ తొలిసారిగా అండర్ వాటర్ మెట్రో పరుగులు పెట్టడం త్వరలో చూడబోతున్నాం. కోల్ కతాలో అండర్ వాటర్ మెట్రో రైలు త్వరలో పరుగులు పెట్టబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ట్రయల్స్ నడుస్తున్నాయి.
హుగ్లీ నదిలో నిర్మించిన సొరంగ మార్గంలో ఏప్రిల్ 12వ తేదీన మెట్రో రైలు పరుగులు పెట్టింది. కోల్‌కతాలోని మహాకరణ్ స్టేషన్ నుంచి హావ్‌డా మైదాన్ మెట్రో స్టేషన్ వరకు మెట్రో రైలు ట్రయల్స్ నిర్వహించారు. ఈ ట్రైన్‌లో కోల్‌కతా మెట్రో జనరల్ మేనేజర్ P ఉదయ్ కుమార్ రెడ్డితో పాటు..కొందరు ఇంజినీర్లు, అధికారులు ప్రయాణించారు.
హుగ్లీ నదిలో రైలు వెళ్లడం ఇదే తొలిసారి. ఇది 33 మీటర్ల లోతులో ఉన్న అత్యంత లోతైన స్టేషన్. భారత్‌లో నీటి లోపల మెట్రో రైలు వెళ్లడం ఇదే తొలిసారి. కోల్‌కతా నగరానికే కాదు..యావత్ భారతదేశానికి ఇది చారిత్రాత్మక ఘట్టం. వచ్చే 7 నెలల పాటు హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లెనేడ్ వరకు ట్రయల్ రన్ కొనసాగనుంది. ఆ తర్వాత ప్రజల కోసం రెగ్యులర్ సర్వీసులు నడుస్తాయి. ఈ మార్గం కోల్‌కతాలోని ఐటీ హబ్ సాల్ట్ లేక్‌లోని హౌరా మైదాన్, సెక్టార్ Vని కలుపుతోంది.
అండర్ వాటర్ మెట్రో రైలు అందుబాటులోకి వస్తే కోల్ కతా, హవ్ డా జిల్లాల మధ్య రాకపోకలు మరింత సులువు అవుతాయి. కోల్‌కతాలోని ఎస్ప్లెనేడ్, హావ్‌డా మైదాన్ మధ్య దీన్ని నిర్మిస్తున్నారు. మొత్తం 4.8 కిలోమీటర్ల పొడవులో సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు. హుగ్లీ నదీ అంతర్భాగంలో 32 మీటర్ల లోతులో 520 మీటర్ల సొరంగాన్ని నిర్మించారు. ఈ మెట్రో రైళ్లో ఎస్ప్లెనేడ్, హావ్‌డా మైదాన్ మధ్య దూరాన్ని కేవలం 45 సెకన్లలో చేరుకోవచ్చు.
1984లో కోల్‌కతాలో ప్రారంభమైన ఈరైలు..దేశంలోనే తొలి మెట్రో రైలుగా కూడా నిలిచింది. దీని తర్వాత భారతదేశ రాజధాని ఢిల్లీ.. 2002లో మెట్రో సేవలను అందించడం ప్రారంభించింది. కాలక్రమంలో మిగతా ప్రధాన నగరాల్లో మెట్రో తన సేవలను విస్తరించింది.