- ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు
మంథని, వెలుగు: ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి ప్రగతి ప్రణాళికల రూపకల్పన కోసం ప్రభుత్వం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు అన్నారు. గురువారం మంథని పట్టణంలోని సత్యసాయినగర్ లో రూ.75 లక్షలతో నిర్మించనున్న జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ బ్రాంచ్ కొత్త బిల్డింగ్ నిర్మాణానికి మంత్రి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంథనిలో కొత్తగా నిర్మిస్తున్న సొసైటీ పనులను వెంటనే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలుదిశగా ప్రభుత్వం పద్ధతి ప్రకారం చర్యలు తీసుకుంటోందన్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు, వంట గ్యాస్ సిలిండర్ సబ్సిడీ,200 యూనిట్ల కరెంట్, ఉచిత విద్య, ఆరోగ్యశ్రీ పరిధి పది లక్షలకు పెంపు వంటి పథకాలను అమలు చేశామని అన్నారు.
రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీకి రూ.18 వేల కోట్లపైగా విడుదల చేశామన్నారు. గతంలో మాదిరిగా మిల్లుల వద్ద రైతులకు ఎటువంటి కోతలు లేకుండా పకడ్బందీగా కొనుగోళ్లు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో కేడీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, సీఈవో సత్యనారాయణ రావు, మంథని బ్రాంచ్ మేనేజర్ ఉదయ శ్రీ, కేడీసీసీ చైర్మన్ కొత్త శ్రీనివాస్ పాల్గొన్నారు.