
- వైద్య విద్యలో నాణ్యత దెబ్బతింటే ప్రజల ప్రాణాలకే ముప్పు: మంత్రి దామోదర
- ప్రైవేట్ మెడికల్ కాలేజీల మేనేజ్‌మెంట్స్, డీన్స్, ప్రిన్సిపాల్స్‌తో సమావేశం
హైదరాబాద్, వెలుగు: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఘోస్ట్ ఫ్యాకల్టీని పెట్టి నిర్వహిస్తే సహించబోమని.. కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. కొన్ని కాలేజీలు ఘోస్ట్ ఫ్యాకల్టీని పెట్టి నడిపిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయని.. అది మంచి పద్ధతికాదని పేర్కొన్నారు. సోమవారం సెక్రటేరియెట్ లో ప్రైవేట్ మెడికల్ కాలేజీల మేనేజ్‌మెంట్స్, డీన్స్, ప్రిన్సిపాల్స్‌తో మంత్రి దామోదర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ డాక్టర్లకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ఉందని, ప్రపంచంలోని ఎన్నో ప్రఖ్యాత మెడికల్ ఇన్‌స్టిట్యూట్స్‌ను ఇక్కడ చదువుకున్న డాక్టర్లు లీడ్ చేస్తున్నారన్నారు. ఇక్కడి వైద్య విద్య ప్రమాణాల వల్లే అది సాధ్యమైందని పేర్కొన్నారు.
ఘోస్ట్ ఫ్యాకల్టీ వల్ల వైద్య విద్య ప్రమాణాలు దిగజారుతాయని, వైద్య విద్యలో నాణ్యత ప్రమాణాలు తగ్గితే ప్రజల ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుందని, నాణ్యత ప్రమాణాలు పాటించని కాలేజీల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, అదనపు ఫీజుల కోసం స్టూడెంట్స్‌ను ఇబ్బంది పెట్టినా, అడ్వాన్స్‌గా ఫీజులు కట్టాలని ఒత్తిడి చేసినా ఉపేక్షించబోమన్నారు. మెడికల్ స్టూడెంట్స్‌కు స్టైఫండ్స్ చెల్లించే విషయంలో కొన్ని కాలేజీలపై వరసగా ఫిర్యాదులు వస్తున్నాయని, స్టైఫండ్ విషయంలో రాజీ పడొద్దని సూచించారు. కాలేజీలు లేవనెత్తిన సమస్యలను ఎన్‌ఎంసీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తామని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు మంత్రి హామి ఇచ్చారు. సమావేశంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చోంగ్తూ, కాళోజీ హెల్త్ యూనివర్శిటీ వీసీ నందకుమార్ రెడ్డి, డీఎంఈ నరేంద్ర కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఎయిడ్స్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలి
రాష్ట్రంలో ఎయిడ్స్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. సోమవారం కోటీలోని టీజీఎంఎస్‌ఐడీసీ ఆఫీస్‌లో స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ(టీఎస్ఏసీఎస్) అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. 2024–25 సంవత్సరంలో 19.02 లక్షల మందికి హెచ్‌ఐవీ టెస్టులు చేయగా, అందులో 9,415 మందికి పాజిటివ్ వచ్చిందని అధికారులు మంత్రికి వివరించారు. రాష్ట్రంలో సుమారు 1.24 లక్షల మంది హెచ్‌ఐవీ పేషెంట్లు ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 5 వేల కంటే ఎక్కువ మంది, మరో 13 జిల్లాల్లో 2 నుంచి 5 వేల మంది చొప్పున పేషెంట్లు ఉన్నారని వివరించారు. ఆ 26 జిల్లాల్లో టెస్టుల సంఖ్య పెంచాలని, హైరిస్క్ గ్రూప్ ప్రజలను గుర్తించి, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి సూచించారు.