
రేగోడ్, వెలుగు: రేగోడ్, అల్లాదుర్గం మండలాలను సంగారెడ్డి జిల్లాలో కలుపుతామని చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా తెలిపారు. ఆదివారం రేగోడు మండల యువత, టీఎన్జీవో బాధ్యులు మంత్రిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. తెలంగాణ యువత సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలకు ముందే ఈ రెండు మండలాలను సంగారెడ్డి జిల్లాలో కలపాలని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ఈ విషయంలో నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారుల ఆదేశించామని చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో రేగోడ్ నోబెల్ యూత్ ప్రెసిడెంట్ సుమన్, టీఎన్జీవో అల్లాదుర్గం యూనిట్ ప్రెసిడెంట్ ధర్మచందర్, యూత్ కాంగ్రెస్ బాధ్యులు శ్రీనివాస్, మహేశ్, వినయ్ కుమార్, వీరప్రసాద్, మతీన్, షఫీ, పూర్ణచందర్ ఉన్నారు.
ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటా
జోగిపేట: తనను గెలిపించినందుకు ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. ఆదివారం ఆయన జోగిపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గం పరిధిలోని మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి మంత్రిని ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన పట్టణంలో కాలినడకన నడుస్తూ వ్యాపారులతో మాట్లాడారు. సమస్యలు పరిష్కరిస్తానని, పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట కౌన్సిలర్లు డాకూరి శివశంకర్, సరేందర్గౌడ్, దుర్గేశ్, చందర్, హరికృష్ణ, నాని, నాయకులు వెంకటేశం, శివకుమార్, ప్రవీణ్, ప్రదీప్ పాల్గొన్నారు.