అజాంజాహి గ్రౌండ్​లో చెట్లు కొట్టేసినప్పుడు పర్యావరణం గుర్తుకురాలేదా?

అజాంజాహి గ్రౌండ్​లో చెట్లు కొట్టేసినప్పుడు  పర్యావరణం గుర్తుకురాలేదా?
  • యువత ఉపాధి కల్పన కోసం కృషి చేస్తుంటే అడ్డుకోవద్దు
  • పరకాల మెగా జాబ్​ మేళాలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​బాబు ఫైర్

హనుమకొండ/ పరకాల, వెలుగు: హైదరాబాద్ లో పారిశ్రామిక కారిడార్​కు ప్రయత్నిస్తుంటే సోషల్​ మీడియా ద్వారా కొందరు అడ్డుకోవాలని చూస్తున్నారని ఐటీ, మున్సిపల్​ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​బాబు ఫైర్​ అయ్యారు. 2019లో అజాంజాహి మిల్లు గ్రౌండ్​లోని వందల ఏండ్ల మర్రి, వేప చెట్లను తొలగించి, పార్టీ మీటింగ్​పెట్టుకున్నప్పుడు పర్యావరణం గుర్తుకు రాలే దా..? అని ప్రశ్నించారు. హనుమకొండ జిల్లా పరకాలలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్​రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మెగా జాబ్​ మేళాను మంత్రి ప్రారంభించి.. వివిధ కంపెనీలకు ఎంపికైన యువతకు నియామక పత్రాలు అందించారు. 

అనంతరం సమావేశంలో మంత్రి శ్రీధర్​బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత పదేండ్లు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు కాంగ్రెస్​ప్రభుత్వం ఉపాధి కల్పనకు కృషి చేస్తుంటే అడ్డుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రగతి ప్రభుత్వం కృషి చేస్తుంటే అడ్డుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.   రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్​ఎంప్లాయ్​మెంట్ ఎక్ఛేంజ్​కు శ్రీకారం చుట్టిందన్నారు.  త్వరలోనే 33 జిల్లాల్లో నైపుణ్యాభివృద్ధి సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు.  ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ రావు,  నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, కుడా చైర్మన్​ ఇనుగాల వెంకట్రామ్​రెడ్డి, హనుమకొండ, వరంగల్​ కలెక్టర్లు  ప్రావీణ్య, సత్య శారద, గ్రేటర్​ కమిషనర్​అశ్విని తానాజీ వాకడే, డీఎఫ్ వో అనూజ్ అగర్వాల్, అధికారులు పాల్గొన్నారు. 

మెగా టెక్స్ టైల్స్ పనులు స్పీడప్ చేయాలి

కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కులో  అభివృద్ధి పనులను స్పీడ్ గా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పరకాల మున్సిపల్ మీటింగ్ లో  టెక్స్ టైల్ పార్క్ అభివృద్ధి పనుల పురోగతిపై రివ్యూ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. స్థానికుల‌కే ఉద్యోగ, ఉపాధి అవ‌కాశాల్లో ప్రాధాన్యమివ్వాలన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 57 వేల ప్రభుత్వ ఉద్యోగావకాశా లు కల్పించామని, రిజర్వేషన్ల ప్రకారం జాబ్​ క్యాలెండర్  ఉండాలనే ఉద్దేశంతో కసరత్తు చేస్తున్నామన్నారు. అనంతరం  మంత్రి ఆర్అండ్ఆర్ లేఔట్ లో పట్టాలిచ్చిన 863 రైతులకు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి చర్యలు చేపట్టాలన్నారు.  గీసుగొండ, సంగెం మండలాల్లో  ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాల్లో 51 బ్యాచ్​ల ద్వారా శిక్షణ కల్పించిన 1,717 మందిలో  82 మందికి మంత్రి సర్టిఫికెట్లు అందజేశారు.