
జనగామ, వెలుగు : వడగండ్ల వానతో నష్టపోయిన అన్నదాతలను ఆదుకుంటామని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హామీ ఇచ్చారు. అకాల వర్షం, వడగండ్ల వాన కారణంగా జరిగిన పంట నష్టంపై ఆదివారం జనగామ కలెక్టర్ శివలింగయ్య, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్‌తో కలిసి రివ్యూ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలిసి జనగామ మండలం పెద్దపహాడ్‌లో దెబ్బతిన్న పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇటీవల దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్ స్వయంగా పరిశీలించి రూ. 10 వేల పరిహారం ప్రకటించారని గుర్తు చేశారు. ఇప్పుడు మరోసారి వడగండ్లు పడి పంటలు దెబ్బతినడం దురదృష్టకరం అన్నారు. పంట నష్టాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. కౌలు రైతులను కూడా ఆదుకుంటామన్నారు. ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశించారు.
కేంద్రం కూడా సాయం అందించాలి
బచ్చన్నపేట, వెలుగు: వడగండ్ల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేంద్రం కూడా తన వంతు సాయం చేయాల ని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి డిమాం డ్ చేశారు. అకాల వర్షం వల్ల జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో దెబ్బతిన్న పంటలను ఆదివారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ జనగామ నియోజకర్గంలో జనగామ, బచ్చన్నపేట, చేర్యాల, కొమురవెళ్లి మండలాల్లో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర విపత్తు నిధి నుంచి రాష్ట్ర రైతులకు సాయం అందించాలని కోరారు. ఆయన వెంట రైతుబంధు జిల్లా కన్వీనర్ ఇర్రి రమణారెడ్డి, సర్పంచ్‌లు బాల్‌రెడ్డి, వెంకట్‌గౌడ్, నాయకులు చంద్రారెడ్డి, కృష్ణంరాజు పాల్గొన్నారు.
దెబ్బతిన్న వరిని పరిశీలించిన కలెక్టర్
జనగామ అర్బన్, వెలుగు : వడగండ్ల వాన కారణంగా జనగామ మండలంలోని పెద్దపహాడ్, వడ్లకొండ గ్రామాల్లో దెబ్బతిన్న వరిని జనగామ కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ ఆదివారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఆర్డీవో సీహెచ్.మధుమోహన్, డీఆర్డీవో పీడీ రాంరెడ్డి, డీఏవో వినోద్‌కుమార్, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై మేనేజర్ సంధ్యా రాణి, తహసీల్దార్ రవీందర్ ఉన్నారు.
రైతులను ఆదుకోవాలి
జనగామ అర్బన్, వెలుగు : అకాల వర్షం కారణంగా జనగామ మండలం గానుగుపహాడ్‌లో దెబ్బతిన్న పంటలను ఆదివారం బీజేవైఎం జనగామ జిల్లా అధ్యక్షుడు సానబోయిన మహిపాల్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు వినోద్, జంపన్న, నరేశ్, చింటు, శివ, చక్రపాణి, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
రూ. 50 వేల పరిహారం ఇవ్వాలి
శాయంపేట/మొగుళ్లపల్లి, వెలుగు : హనుమకొండ జిల్లా శాయంపేట మండలానికి చెందిన రైతులు ప్రతి సంవత్సరం ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్నా ప్రభుత్వం ఒక్కసారి కూడా పరిహారం ఇవ్వలేదని టీపీసీసీ సభ్యుడు గండ్ర సత్యనారాయణరావు విమర్శించారు. శనివారం కురిసిన వర్షం కారణంగా దెబ్బతిన్న పంటలను ఆదివారం ఆయన పరిశీలించి రైతులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దెబ్బతిన్న వరి, మొక్కజొన్నకు ఎకరానికి రూ. 50 వేల చొప్పున పరిహారం ఇవ్వడంతో పాటు మద్దతు ధర ప్రకటించి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి, నాయకులు చిందం రవి, చింతల రవిపాల్, ఎండీ.రఫీ, నిమ్మల రమేశ్, మారపెల్లి రాజు ఉన్నారు. అనంతరం మొగుళ్లపల్లిలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.
మరిపెడ, వెలుగు: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఆనెపురంలో దెబ్బతిన్న వరి, మక్కజొన్న, మిరప, మామిడి తోటలను ఆదివారం కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేశ్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడి ఆధారంగా నష్టాన్ని అంచనా వేసి సగమైనా చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భరత్ చందర్‌రెడ్డి, రామచందర్ నాయక్, వెంకన్న, రవినాయక్, తాజుద్దీన్ పాల్గొన్నారు.
బచ్చన్నపేట, వెలుగు: నష్టపోయిన రైతులను ఆదుకోవాలని పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి, కొన్నె, చిన్నరాంచర్ల, బచ్చన్నపేట, నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరశీలించారు. కిసాన్ సర్కార్ అని చెప్పుకునే కేసీఆర్ నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని కోరారు. ఆయన వెంట కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు వంచ వెంకట్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మహాత్మాచారి, నాయకులు నారాయణరెడ్డి, శ్రీనివాస్, మహేందర్ ఉన్నారు.