యాదగిరిగుట్ట ఆలయాన్ని హరీశ్​రావు అపవిత్రం చేసిండు

  • ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు : పవిత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో మాజీ మంత్రి హరీశ్ రావు రాజకీయాలు మాట్లాడి అపవిత్రం చేశారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మండిపడ్డారు. హరీశ్ రావు సహా బీఆర్ఎస్ నాయకుల రాకతో మైల పట్టిన యాదగిరిగుట్ట ఆలయాన్ని గురువారం కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే శుద్ధిచేశారు.

చీపురు పట్టి ఆలయ ప్రాంగణాన్ని ఊడ్చి నీటితో కడిగారు. అనంతరం కొండ కింద వైకుంఠ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పేరుతో అవినీతికి పాల్పడిన కేసీఆర్ ను సాక్షాత్తు నారసింహుడే ఫాంహౌస్ కు పరిమితం చేసినా బీఆర్ఎస్ నాయకులకు బుద్ధి రావడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తుంటే అది చూసి ఓరుస్తలేరని విమర్శించారు. అసెంబ్లీ, లోక్​సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్పినా కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు అహంకారం తగ్గడం లేదన్నారు.

దేవుడి పేరుతో ప్రజల సొమ్ము దోచుకున్న నీచ చరిత్ర కేసీఆర్ కుటుంబానిదని ఆరోపించారు. ఇకనైనా బీఆర్ఎస్ నాయకులు తమ వైఖరిని మార్చుకోకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం వార్డు సభ్యులు కూడా గెలవబోరని హెచ్చరించారు. మాజీ ఎంపీపీ శ్రీశైలం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాలరాజుగౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ భరత్ గౌడ్, జిల్లా నాయకులు దుంబాల వెంకట్ రెడ్డి, ఉపేందర్ గౌడ్, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింహ, తుర్కపల్లి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.