అమరవీరుల త్యాగాలను కేసీఆర్​ గౌరవించలే

అమరవీరుల త్యాగాలను కేసీఆర్​ గౌరవించలే
  • యువత ఆత్మబలిదానాలతోనే తెలంగాణ వచ్చింది: జూపల్లి
  • శ్రీకాంతాచారి ఆశయాలను నెరవేరుస్తం: పొన్నం
  • యువత త్యాగాలతోనే ప్రత్యేక రాష్ట్రం సాధించినం: కోదండరాం
  • అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ‘యూత్​ డే’ 

బషీర్ బాగ్, వెలుగు: గత ప్రభుత్వంలో ప్రగతి భవన్‌‌‌‌లోకి మంత్రులకు కూడా ప్రవేశం లేదని, ప్రజా సమస్యలపై అక్కడ చర్చకు అవకాశం ఉండేది కాదని తెలిపారు. గద్దర్‌‌‌‌లాంటి మహనీయులు కూడా ప్రగతి భవన్ గేటు వద్ద కేసీఆర్​అపాయింట్​మెంట్​ కోసం నిరీక్షించారని గుర్తుచేశారు. హైదరాబాద్ బషీర్‌‌‌‌బాగ్ ప్రెస్ క్లబ్‌‌‌‌లో ‘తెలంగాణ జన సమితి పార్టీ’ అనుబంధ ‘యువజన విద్యార్థి జన సమితి’ ఆధ్వర్యంలో ఉద్యమకారుడు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా 'తెలంగాణ యూత్ డే' సదస్సు నిర్వహించారు.

ఈ సదస్సులో మంత్రి జూపల్లి కృష్ణారావు తోపాటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ , ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు , ఎమ్మెల్సీ ప్రొఫెసర్​ కోదండరాం  పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ... గత పదేండ్లలో విద్య, వైద్యం, ఆర్థిక రంగాలు నిర్వీర్యం అయ్యాయని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా శ్రీకాంతాచారి బలిదానం చేసుకున్నారని అన్నారు. ఆయన వర్ధంతి ని యూత్ డే గా ప్రకటించాలని కోరడంలో తప్పు లేదని , ఈ ప్రతిపాదనను సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అలాగే, స్కిల్​ యూనివర్సిటీకి శ్రీకాంతాచారి పేరు ను ప్రతిపాదిస్తానని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ తన వల్లనే రాష్ట్రం ఏర్పడిందని తప్పుడు ప్రచారాలు చేసుకున్నారని,  సకల జనుల పోరాటం , యువకుల ఆత్మబలిదానాల వల్లే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని తెలిపారు. 

ఉద్యమానికి శ్రీకాంతాచారి ఊపిరి పోశారు..

శ్రీకాంతాచారి ఆశయాలను ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పదేండ్లలో భర్తీ చేయని ఉద్యోగాలను ఏడాదిలో భర్తీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన వ్యక్తి శ్రీకాంతాచారి అని కొనియాడారు. 

తెలంగాణ తనతోనే వచ్చిందన్న కేసీఆర్​అబద్ధాలు పటాపంచలు కావాలన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం యావత్​  తెలంగాణ పోరాడుతుంటే.. సోనియా గాంధీ మద్దతుగా నిలిచారన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం పార్లమెంటులో తాము ఎన్నో పోరాటాలు చేశామని అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సహించబోమన్నారు. యువత త్యాగాలతోనే ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైందని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. వారి ఆశయాలు, ఆకాంక్షలు నెరవేర్చడం తమ బాధ్యత అని తెలిపారు.  

తెలంగాణ పితామహుడు కోదండరాం: కూనంనేని

ఉద్యమ సమయంలో తెలంగాణ పితామహుడిగా ప్రొఫెసర్ కోదండరాం పేరొందారని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కొనియాడారు. తెలంగాణ కోసం తన మంత్రి, ఎమ్మెల్యే పదవులకు జూపల్లి కృష్ణారావు రాజీనామా చేశారని గుర్తు చేశారు. మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైన కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతిని గత నాలుగేండ్లుగా ‘‘తెలంగాణ యూత్ డే’’గా నిర్వహిస్తున్నామని యువజన సమితి రాష్ట్ర అధ్యక్షుడు సలీమ్ పాషా తెలిపారు. ఈ సదస్సులో విద్యార్థి జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాసంపల్లి అరుణ్ కుమార్ పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు. 

తీర్మానాలివే..

అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి అయిన డిసెంబర్ 3వ తేదీని ‘తెలంగాణ యూత్ డే’గా ప్రకటించాలి

రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే  స్కిల్ వర్సిటీకి శ్రీకాంతాచారి పేరు పెట్టాలి.

ప్రైవేట్​ వర్సిటీల్లో రిజర్వేషన్లు అమలుచేయాలి.

జిల్లా కేంద్రాల్లో స్కిల్ సెంటర్ల ను ఏర్పాటు చేయాలి. 

ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్ బకాయిలను విడుదల చేయాలి

తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలి.