వచ్చే 50 ఏళ్లు నీటి సమస్య రాకుండా చర్యలు : జూపల్లి కృష్ణారావు

వచ్చే 50 ఏళ్లు నీటి సమస్య రాకుండా చర్యలు : జూపల్లి కృష్ణారావు
  • రాష్ట్ర పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు 

గద్వాల, వెలుగు:   రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల ను  ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నెరవేరుస్తున్నామని  రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని నది అగ్రహారం దగ్గర అమృత్ 2.0 స్కీం లో భాగంగా 63.25 కోట్ల తో  చేపట్టిన పనులకు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి 16 మంది సీఎంలు 64 ఏళ్లలో 65 వేల కోట్లు అప్పు చేశారని.. కానీ గత పదేళ్లలో మాజీ సీఎం కేసీఆర్ ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేశాడన్నారు.

 8 లక్షల కోట్ల అప్పులకు నెలనెలా రూ. 6500 కోట్ల వడ్డీ కడుతున్నామన్నారు.  50 ఏళ్ల దూర దృష్టితో గద్వాల మున్సిపాలిటీకి నీటి కొరత ఉండొద్దనే ఉద్దేశంతో అమృత్ 2.0  స్కీం కింద కేంద్ర ప్రభుత్వం 28.75 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం 34.50 కోట్లతో పైపుల నిర్మాణం పంప్ హౌస్ లు ఏర్పాటు చేసిందన్నారు.  ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ..  ఉపాధి హామీ కూలీలకు మాదిరిగానే మున్సిపాలిటీల్లో  ఉండే కూలీలకు కూడా రూ. 12 వేలు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ సంతోష్, మున్సిపల్ చైర్ పర్సన్ బీఎస్ కేశవ్, పబ్లిక్ హెల్త్ ఈఈ విజయ భాస్కర్ రెడ్డి,  వైస్ చైర్మన్ బాబర్ తదితరులు పాల్గొన్నారు.

మాజీ జడ్పీ చైర్ పర్సన్ అనుచరుల నినాదాలు

మంత్రి ప్రోగ్రాంకు ముందుగానే అక్కడికి వచ్చిన మాజీ జడ్పీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్  సరిత కొద్దిసేపు వెయిట్ చేశారు.  మంత్రి వచ్చాక  సభా వేదిక పైకి ఆహ్వానం అందకపోవడంతో అక్కడి నుంచి తన అనుచరులతో కలిసి బయటికి వెళ్లిపోయారు. 

ఈ సమయంలో మాజీ జడ్పీ చైర్ పర్సన్ అనుచరులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం   కృష్ణవేణి చౌరస్తాకు చేరుకొని రాస్తారోకో చేశారు. కాగా కార్యక్రమానికి  30 మంది ఎస్ఐలు, 10 మంది సీఐలు, డీఎస్పీలు,  పోలీసులతో బందోబస్తు పర్యవేక్షించారు.   మార్కెట్ కమిటీ చైర్మన్ కారు సడన్‌‌‌‌‌‌‌‌ గా బ్రేక్ వేయడంతో మంత్రి కాన్వాయ్ లోని మూడు వాహనాలు దెబ్బతిన్నాయి.