
- మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపణ
- సాగర్, శ్రీశైలం ఎండబెట్టినందుకే
- కల్వకుంట్ల ఫ్యామిలీ ఓటమి
- పదేండ్లలో దురాజ్ పల్లిలో కవిత ఎందుకు బోనం ఎత్తలేదని ప్రశ్నించిన మంత్రి
సూర్యాపేట, వెలుగు : జగన్ తో మిలాఖత్ అయిన కేసీఆర్ రాయలసీమ, ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లకు తెలంగాణ నీళ్లు కానుకగా ఇచ్చాడని, పోతిరెడ్డిపాడు నుంచి 88 వేల క్యూసెక్కుల నీళ్లను తీసుకుపోయేందుకు సహకరించారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. బుధవారం సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లి లింగమంతుల స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ప్రగతిభవన్‌కు ఆహ్వానించి జగన్ కు బిర్యానీ పెట్టి శ్రీశైలం, సాగర్ ను కేసీఆర్ ఎండబెట్టారని మండిపడ్డారు.
జగన్ కు అమ్ముడుపోకపోతే ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారో చెప్పాలని ఎమ్మెల్సీ కవితను మంత్రి ప్రశ్నించారు. కేసీఆర్ నిజాయితీగా ఏనాడు తెలంగాణ కోసం కొట్లాడలేదని, దొంగ దీక్ష చేశాడని ఆరోపించారు. నల్గొండలో తను దీక్ష చేస్తే ఆనాటి ప్రభుత్వం భయపడి అరెస్ట్ చేసిందని గుర్తుచేశారు.
అధికారంలో ఉన్న పదేండ్లలో కవిత దురాజ్ పల్లిలో ఎందుకు బోనమెత్తలేదని మంత్రి ప్రశ్నించారు. అధికారం పోయాక గుర్తుకు వచ్చిందంటూ విమర్శించారు. కాంగ్రెస్ నేతల పోరాటం వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. త్యాగాలతో తెచ్చుకున్న రాష్ట్రాన్ని ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ వేల కోట్లు దోచుకున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనను మెచ్చి దావోస్ లో రూ.1.72 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. లక్ష రుణమాఫీని 5 విడతల్లో చేసినోళ్లు రైతుల గురించి మాట్లాడటం సిగ్గచేటన్నారు.