
- ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా నెరవేరుస్తాం
- జిల్లా సమగ్రాభివృద్ధే ధ్యేయం
- మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
నల్గొండ అర్బన్, వెలుగు : ప్రజా సమస్యలు తీర్చినప్పుడు కలిగే సంతృప్తి మరెందులోనూ లేదని రోడ్లు, భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం నల్గొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మంత్రి వినతులు స్వీకరించి పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఆర్థిక ఇబ్బందులతో కాలేజీ ఫీజులు కట్టలేక, ఆస్పత్రుల్లో చికిత్స కోసం వచ్చిన అభ్యర్థనలను మానవత్వంతో పరిష్కరించి వారి ముఖంలో సంతోషం నింపారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ చుట్టూరా నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డుతో రాష్ట్ర ప్రగతి మరో మెట్టు ఎక్కుతుందన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు పనులకు ఉత్తర భాగానికి టెండర్లు పిలిచామని, దక్షిణ భాగానికి సంబంధించి డీపీఆర్ కు టెండర్లు పిలిచామని తెలిపారు. త్వరలోనే ట్రిపుల్ఆర్నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. గత ఎన్నికల ముందు కేసీఆర్ ఔటర్ రింగ్ రోడ్డును కమిషన్ కోసం అమ్ముకున్నారని విమర్శించారు.
రూ.30 వేల కోట్లతో రీజినల్ రింగ్ రోడ్డు పనులను ప్రారంభించాల్సి ఉన్నా నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు. రీజినల్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డుకు మధ్య నిర్మిస్తున్న రేడియల్ రోడ్స్ తో తెలంగాణ రూపురేఖలు మారుతాయని చెప్పారు. హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందన్నారు. దశాబ్ధాల నల్గొండ జిల్లా సాగు, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు శ్రీశైలం టన్నెల్ బేరింగ్ మిషన్ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు.
అమెరికా నుంచి రాబిన్స్ బోరింగ్ కంపెనీ నుంచి వచ్చే మరో బేరింగ్ మిషన్ మద్రాసు పోర్టుకు వచ్చిందన్నారు. రెండేండ్లలో శ్రీశైలం సొరంగం మార్గం పనులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఐదుసార్లు తనను ఎమ్మెల్యేగా గెలిపించిన నల్గొండ నియోజకవర్గ ప్రజలకు తను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధే తన ధ్యేయమన్నారు. అన్నిరంగాల్లో నల్గొండ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ రమేశ్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్, నల్లగొండ, తిప్పర్తి, కనగల్ మాజీ జడ్పీటీసీలు వంగూరి లక్ష్మయ్య, పాశం రామ్ రెడ్డి, నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, కనగల్ మండల అధ్యక్షుడు గడ్డం అనుప్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, పలువురు మాజీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన..
నల్గొండ పట్టణంలోని 10వ వార్డు నీలగిరి కాలనీలో నూతనంగా నిర్మించిన లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆదివారం జరిగిన యంత్ర, విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండితులు మంత్రికి వేదాశీర్వచనం ఇచ్చారు. అనంతరం ఆలయాన్ని ఆయన పరిశీలించి ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు.