
- మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నల్గొండ అర్బన్, వెలుగు : క్రమశిక్షణకు మారుపేరుగా పోలీసులు నిలుస్తారని, పోలీస్ శాఖకు ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ముగింపు కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీసులకు పని ఒత్తిడి తగ్గించేందుకే క్రీడలు నిర్వహించినట్లు తెలిపారు.
డ్రగ్స్ తో యువత తమ జీవితాలను ఆగం చేసుకోవద్దని, సన్మార్గంలో పయనించాలని సూచించారు. నల్గొండను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీసులు కృషి చేయాలని కోరారు. శారీరక ధారుఢ్యాన్ని పెంచుకోవడం కోసం క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. నూతన పోలీస్ క్వార్టర్ల నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. రానున్న రంజాన్ పండుగను హిందూ ముస్లింలు సోదరభావంతో కలిసిమెలిసి జరుపుకోవాలని సూచించారు.
రాష్ట్రంలోనే మొదటిసారి దివ్యాంగులు, వృద్ధుల కోసం కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కు ప్రభుత్వం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ రెవెన్యూ, పోలీస్ శాఖల మధ్య క్రీడాపోటీలు నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తామని తెలిపారు. పోలీసులకు క్రీడలు చాలా అవసరమన్నారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ పోలీస్ వార్షిక క్రీడల సందర్భంగా సుమారు 600 మంది పోలీసులు పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు.
నల్గొండ, దేవరకొండ, మిర్యాలగూడతోపాటు అన్ని డివిజన్ల పోలీసులు పాల్గొన్నారని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో మెడల్స్ సాధించిన పోలీసులు జిల్లాలో ఉన్నారని తెలిపారు. మూడు రోజులపాటు నిర్వహించిన క్రీడల్లో ఏఆర్ నల్గొండ జుట్టుకు మొదటి బహుమతి సాధించగా, నల్లగొండ సబ్ డివిజన్ క్రీడాకారులు రెండో బహుమతి గెలుచుకున్నారు. ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌గా ఏఆర్ జట్టు బహుమతి గెలుచుకుంది.