- ఫారెస్ట్, రెవెన్యూ భూ సమస్యలు పరిష్కరించాలి
- అర్హులైన రైతులందరికీ పట్టాలివ్వాలి
- అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
మెదక్, వెలుగు : పొజిషన్ లో ఉండి భూములు దున్నుకునే రైతులను ఇబ్బందులు పెట్టొద్దని, సాగు చేసుకునే పంటలు ధ్వంసం చేయొద్దని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఫారెస్ట్ఆఫీసర్లకు సూచించారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. చేగుంట మండలం ఇబ్రహీంపూర్, రుక్మాపూర్, మాసాయిపేట మండలం నడిమి తండాలో 40 , 50 ఏళ్లుగా భూములు సాగు చేసుకుంటున్న రైతులను ఫారెస్ట్ఆఫీసర్లు ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఇబ్రహీంపూర్లో ఒక సర్వే నెంబర్లో పట్టాలిచ్చి, మరో సర్వే నెంబర్లో ఇవ్వలేదన్నారు.
ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ.. మండలానికి రెండు గ్రామాల్లో మాత్రమే పోడు భూములకు పట్టాలిచ్చారని, ఇతర గ్రామాల పోడు రైతులకు పట్టాలు రాక రైతుబంధు, రైతు బీమా వంటి పథకాల బెనిఫిట్స్అందడం లేదని, పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేకపోతున్నారన్నారు. కౌడిపల్లి మండలం దేవులపల్లిలో ఓ గిరిజన రైతు సాగు చేస్తున్న పంటలు ధ్వంసం చేసి అతడి వెహికల్స్సీజ్ చేశారన్నారు. శివ్వంపేట మండలం నవాపేటలో గిరిజనులు అనేక ఏళ్లుగా ఫారెస్ట్‌ను ఆనుకుని ఇండ్లు కట్టుకుని నివసిస్తుండగా ఖాళీ చేయాలంటున్నారని తెలిపారు.
ఎమ్మెల్సీ శేరిసుభాష్ రెడ్డి మాట్లాడుతూ.. చిన్నశంకరంపేట మండలంలో 70 ఏళ్లుగా పంటలు సాగు చేసుకుంటున్న రైతులను ఫారెస్ట్ఆఫీసర్లు ఇబ్బంది పెడుతున్నారన్నారు. కొన్నిచోట్ల గ్రామం మొత్తం ఫారెస్ట్‌లోనే ఉందంటున్నారని తెలిపారు. వీటిపై స్పందించిన మంత్రి ఫారెస్ట్, రెవెన్యూ ఆఫీసర్లు జాయింట్ సర్వే చేసి భూ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్, డీఎఫ్‌వోలకు సూచించారు. ప్రభుత్వం తరపున ఏవైనా పర్మిషన్ కావాలంటే ఇస్తామన్నారు. నిబంధనల ప్రకారం అర్హులైన రైతులకు పట్టాలు అందేలా చూడాలన్నారు.
వన మహోత్సవంలో నాటిన మొక్కలు, ఎవెన్యూ ప్లాంటేషన్, ఫారెస్ట్భూములకు సంబంధించిన కేసులగురించి సరైన సమాచారం లేకుండా రావడంతో డీఎఫ్‌వో జోజిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో కోట్ల విలువైన గన్నీ బ్యాగుల గోల్మాల్జరిగితే ఔట్ సోర్సింగ్ఉద్యోగులపై మాత్రమే చర్యలు తీసుకోవడాన్ని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి తప్పుబట్టారు. ధాన్యం కొనుగోలు సందర్భంగా తరుగు పేరుతో మిల్లర్లు రైతులకు నష్టం కలిగిస్తున్నారని, ఈ విషయం ఎన్నిసార్లు సివిల్సప్లై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆరోపించారు. ఫిర్యాదు చేసినా మిల్లర్లపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ రైస్ మిల్లర్లకు కొమ్ము కాయొద్దని రైతులకు ఇబ్బందులు లేకుండా, నష్టం కలగకుండా చూడాలని సివిల్సప్లై అధికారులను ఆదేశించారు.
రామాయంపేట మండలం కోనాపూర్, చేగుంట మండలం ఇబ్రహీంపూర్, రెడ్డిపల్లి సొసైటీల్లో కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగినా బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఎంపీ రఘునందన్ రావు డీసీవో కరుణను ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడిన వారు కోర్టుకు వెళ్లేందుకు చాన్స్ ఎందుకు ఇస్తున్నారని, డిపార్ట్మెంట్తరపున కేవియట్ఎందుకు వేయడం లేదన్నారు. ఈ అంశంపై కలెక్టర్‌రాహుల్‌రాజ్ స్పందిస్తూ.. సొసైటీల్లో ఆడిట్ప్రాపర్గా జరగడం లేదన్నారు. దీనివల్ల అక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. ప్రైవేట్స్కూల్స్ఇష్టారీతిగా ఫీజులు వసూలు చేయకుండా నియంత్రించాలని మంత్రి సురేఖ డీఈవో రాధాకిషన్ ను ఆదేశించారు.
కౌడిపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రారంభిస్తే తనకు కనీస సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్యే సునీతారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. రోడ్లు, అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని ఎంపీ రఘునందన్ రావు ఆర్అండ్ బీ ఈఈ సర్దార్ సింగ్‌ను ఆదేశించారు. ప్రైవేట్ హాస్పిటల్స్ అధికంగా బిల్లులు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, నిబంధనలు పాటిస్తున్నాయా లేదా చెక్ చేయాలని డీఎంహెచ్‌వో శ్రీరామ్‌ను మంత్రి ఆదేశించారు. ఏడుపాయల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే రోహిత్‌రావు మంత్రిని కోరారు. సమావేశానికి ముందు మంత్రి సురేఖ, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే రోహిత్ రావు కలెక్టరేట్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. చాకలి ఐలమ్మకు నివాళులు అర్పించారు.