ఉమ్మడి రాష్ట్రంలో వేములవాడలాంటి పాపులర్ గుడిని బద్నాం చేశారని మంత్రి కేటీఆర్ అన్నారు. వేములవాడ రాజరాజేశ్వరీ దేవాలయం.. దక్షిణ కాశీ అని.. అందరూ ఇక్కడే కోడె మొక్కులు చెల్లిస్తారని అన్నారు. వేములవాడ గుడికి వస్తే మంత్రి పదవులు పోతయని గతంలో తప్పుడు ప్రచారం చేశారని అన్నారు. వేములవాడలోనే కేసీఆర్ పెళ్లి జరిగిందని.. ఆనాడే వేములవాడ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. రాజన్న గుడిని అభివృద్ధి చేయడం తమ బాధ్యత అని చెప్పారు. కాశీకి వేల కోట్ల రూపాయలు ఇచ్చిన కేంద్రం రాజన్నకి ఎందుకు ఇవ్వదని ప్రశ్నించారు.
బండి సంజయ్ నిజంగా రాజన్న భక్తుడు అయితే.. రాజన్న అభివృద్ధికి కేంద్రం నుంచి రూ.100కోట్లు తీసుకురావాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అలాగే.. వేములవాడ రాజన్న, కొండగట్టు, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి, జోగులాంబ భద్రాచలం ఆలయాల అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని బండి సంజయ్ ని నిలదీశారు. ఇప్పటివరకు చేసిన పనుల్లో తమ భాగస్వామ్యం కూడా ఉందని బీజేపీ అబద్ధాలు చెబుతోందని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో రైతుల కోసం చేస్తున్న పథకాల్లో ఒక్కటైనా.. బీజేపీ రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. పల్లె పల్లెనా ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు ఉన్నాయని చెప్పారు.