ఇళ్లు కాలి ఒకడు ఏడుస్తుంటే..సుట్ట అంటి పెట్టుకోవడానికి నిప్పు అడిగిన చందంగా ఉంది జగిత్యాల బీఆర్ఎస్ నేతల వ్యవహార శైలి. ఓ వైపు తండ్రి మరణంతో పుట్టెడు దుఖంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ ఉండగా..ఆయన్ను పరామర్శించేందుకు వచ్చిన మంత్రి కేటీఆర్తో సెల్ఫీల దుకాణానికి తెరలేపారు. సంతాప సభలో ఎమ్మెల్సీ ఎల్ రమణ తండ్రికి నివాళులు అర్పించాల్సింది పోయి మంత్రి కేటీఆర్తో నవ్వులు రువ్వుకుంటూ సెల్ఫీలు దిగారు. కార్యకర్తలను వద్దని వారించకుండా...మంత్రి కేటీఆర్ స్టేజ్ పైన సెల్ఫీ లు దిగడంతో సంతాప సభకు వచ్చిన పలువురు విమర్శలు గుప్పించారు.
మంత్రి కేటీఆర్కు అయినా తెలిసుండాలి కదా...
జగిత్యాల పట్టణంలో స్థానిక విరూపాక్షి గార్డెన్స్లో ఎమ్మెల్సీ ఎల్. రమణ తండ్రి ఎల్జీరాం మృతికి సంతాపంగా సభ నిర్వహించారు. ఈ సభకు హాజరైన మంత్రి కేటీఆర్..నివాళులు అర్పించాల్సింది పోయి..స్టేజ్ పైనే బీఆర్ఎస్ కార్యకర్తలతో సెల్ఫీలు దిగారు. సంతాప సభకు హాజరయ్యానన్న సోయి కూడా లేకుండా నవ్వుతో కార్యకర్తలకు సెల్ఫీలు ఇచ్చారు. అటు మంత్రి కేటీఆర్ సెల్ఫీలు దిగుతుంటే ఎల్. రమణ బిత్తరపోయి చూస్తూ ఉండిపోయారు.
సెల్ఫీల తర్వాత పరామర్శ..
ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ తండ్రి ఎల్.జి రాం స్వర్గస్తులవడంతో ఏర్పాటు చేసిన సంతాప సభలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఎల్ రమణను పరామర్శించిన మంత్రి కేటీఆర్..ఎల్జీరాం ఫోటోకు పూలమాల వేసి నివాళులు అర్పించారు.