హైదరాబాద్: దేవుళ్లపై ప్రమాణాలు చేస్తే సమస్యలు పరిష్కారం కావు అని మంత్రి కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం యాదాద్రి లక్ష్మినరసింహా స్వామిపై ప్రమాణం చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో దొంగ ఎవరో.. దొర ఎవరో ప్రజలకు తెలుసునని చెప్పారు. ఈ కేసు కోర్టు పరిధిలో ఉందని, అందుకే తమ పార్టీ కార్యకర్తలను ఈ విషయంపై మాట్లాడొద్దని సూచించానని మంత్రి తెలిపారు. తాను కూడా మాట్లాడబోనని, మాట్లాడితే దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేస్తున్నారని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతాయని చెప్పారు.
రేపిస్టులకు దండలు వేసి సన్మానించిన వాళ్లు కూడా న్యాయం గురించి మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. అమిత్ షా చెప్పులు మోసిన చేతులతో బండి సంజయ్ యాదగిరి గుట్టకు వచ్చారని.. కాబట్టి యాదగిరి గుట్టలో సంప్రోక్షణ కార్యక్రమం చేయాలని మంత్రి ఎద్దేవా చేశారు.