
‘‘వాళ్లు వీళ్లవుతారు.. వీళ్లు వాళ్లవుతారు’’ అనే నానుడి రాజకీయాల్లో మరోసారి నిజమైంది. ఆరు నెలల కిందట ఆయనను దూరంపెట్టిన వాళ్లే.. ఇప్పుడు ఏకంగా కాళ్ల మీద పడ్డారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆయనో కీలక నేత. ఉమ్మడి రాష్ట్రంలో కేబినెట్ మంత్రిగా పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు అదృష్టం కలిసి రాలేదు. తన కుటుంబమంతా ప్రజాప్రతినిధులైనప్పటికీ ఆయనకు ఏదో వెలితి! పెద్దల సభలో అవకాశం దొరికింది.. కానీ, అసెంబ్లీ పోరులో గెలిచి తీరాలనే మొండి పట్టుదల వెంటాడింది.
ఈలోపు సొంత నియోజకవర్గంలోనే ఎన్నో ఆటుపోట్లు.. సొంత పార్టీ నేతలే దుమ్మెత్తిపోశారు. ప్రతి ప్రోగ్రామ్‌కు గెలికి కయ్యం పెట్టుకున్నారు. దీంతో తనకు టికెట్ దక్కకుంటే ‘కారు’ దిగేందుకు ఆయన రెడీ అయ్యారు. దీంతో అప్పటివరకు ఆయన వైపు చూడని ప్రగతిభవన్ పెద్దలు రంగంలోకి దిగారు. ఆయనను పిలిచి బుజ్జగించారు. ఐదు నియోజకవర్గాల్లో మనోళ్లను గెలిపించుకొని వస్తే.. వచ్చే ప్రభుత్వంలో మంత్రిని చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మంత్రిని చేసుడు కాదు.. ఇప్పుడే పదవి కావాలంటూ ఆయన పట్టుబట్టారు. లేకుంటే తన దారి తాను చూసుకోవాల్సి వస్తుందని అల్టిమేటం ఇచ్చారు. దీంతో అమాత్య పదవి వచ్చింది.. ఆయన మాట నెగ్గింది.. సీన్ మారిపోయింది.
ఇన్నాళ్లూ ఆయనను పట్టించుకోనట్టు మెలిగిన లీడర్లంతా ఇప్పుడు ఆయన ఇంటికి క్యూ కడ్తున్నారు. ఒకరిద్దరు లీడర్లు కాళ్లు మొక్కి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. వాళ్లు అట్ల బయటకు వెళ్లగానే... ‘చూశారా ఎవరైనా నా కాళ్ల దగ్గరకు రావాల్సిందే’నంటూ తన అనుచరుల ముందు ఆ లీడర్ గల్లా ఎగరేశారు. ఇన్నాళ్లూ తనను కాదన్నోళ్లకు.. ఇప్పుడు తానే కావాల్సి వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో పార్టీ లీడర్లను గెలిపించి తన సత్తా చూపిస్తానని ఆయన ధీమా ప్రదర్శిస్తున్నారు. వచ్చే సర్కారులోనూ తనకు కీలక పదవి గ్యారంటీ అని చెప్పుకుంటున్నారు.