పండుగలోపు పంచేద్దాం! సంక్రాంతికి ‘డబుల్’ ఇండ్ల పంపిణీకి సన్నాహాలు

  • మల్లెమడుగు ఇండ్లను లబ్ధిదారులకు పంచిన మంత్రి పొంగులేటి
  • మిగిలిన చోట్ల పెండింగ్ పనులు స్పీడప్  
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 345 ఇండ్లు రెడీ

ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇండ్లు లేని నిరుపేదలకు సంక్రాంతి కానుక అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కొద్ది శాతం పనులు మాత్రమే పెండింగ్ ఉన్న డబుల్ బెడ్ రూమ్​ ఇండ్లను పండుగ కంటే ముందే పంపిణీ చేసేందుకు ప్లాన్​ చేస్తోంది. రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే ఆయా మండలాల్లో ఉన్న డబుల్ బెడ్​రూమ్​ ఇండ్ల పరిస్థితిపై కలెక్టర్లు నజర్​ పెట్టారు. 90 శాతం వరకు పనులు పూర్తయిన వాటిని గుర్తించి, వాటిని వెంటనే పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధం చేయాలని ఆఫీసర్లకు సూచించారు. 

గతంలో 12,536 ఇండ్లు మంజూరు 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో 12,536 ఇండ్లను మంజూరు చేశారు. వీటిలో 8,260 ఇండ్లను ఇప్పటికే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మిగిలిన ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయి. వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ఈనెల 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

ఇందుకోసం ఇప్పటికే లబ్ధిదారుల సర్వేను కూడా తొలిదశలో పూర్తి చేశారు. రెండో దశలో మండల స్థాయి అధికారులు లబ్ధిదారుల వివరాలను క్రాస్​ చెక్​ చేస్తున్నారు. ముందుగా డబుల్ బెడ్​రూమ్​ ఇండ్లను పంపిణీ చేయడం ద్వారా లబ్ధిదారుల్లో కొంత మందికైనా ముందే న్యాయం జరుగుతుందని ఆఫీసర్లు భావిస్తున్నారు. ఎక్కువమంది అర్హులు ఉండి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు తక్కువ ఉన్నచోట ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామని మిగిలిన వారికి హామీ ఇస్తున్నారు.  

ఖమ్మంలో 131, కొత్తగూడెంలో 214 ఇండ్లు రెడీ.. 

గత ప్రభుత్వ హయాంలో ఖమ్మం జిల్లాలో 7,229 ఇండ్లకు టెండర్లు పిలువగా, 5501 ఇండ్లను లబ్ధిదారులకు అందజేశారు. 467 ఇండ్ల నిర్మాణం ప్రారంభం కాలేదు. 823 ఇండ్లు నిర్మాణంలో ఉండగా, 606 ఇండ్లు 80 శాతానికి పైగా పూర్తయాయి. జిల్లాలో వెంటనే పంపిణీ చేసేందుకు మొత్తం 131 ఇండ్లు సిద్ధంగా ఉండగా, అందులో ఖమ్మం అర్బన్​ మండలం మల్లెమడుగులో 84 ఇండ్లను శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించి, లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. 

నేలకొండపల్లి మండలం ఆచార్యులగూడెంలో 18 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు. కూసుమంచి మండలం దుబ్బతండాలో 29 ఇల్లు పంపిణీకి రెడీగా ఉన్నాయి. ఇక భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 5,307 ఇండ్లకు గాను 2,759 ఇండ్లను లబ్ధిదారులకు అందించారు. 2,206 ఇండ్లు నిర్మాణంలో ఉండగా, 214 ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్లకంటే ముందుగానే డబుల్ బెడ్​ రూమ్​ ఇండ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.