భక్త రామదాసు మందిరం అభివృద్ధికి కృషి

భక్త రామదాసు మందిరం అభివృద్ధికి కృషి
  •  భక్త రామదాసు జయంతి ఉత్సవాల్లో మంత్రి పొంగులేటి 

నేలకొండపల్లి, వెలుగు :   భక్త రామదాసు ధ్యాన మందిరాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఉన్న రామదాసు జన్మస్థలం అయిన నేలకొండపల్లిలో భక్త రామదాసు 392 వ జయంతి ఉత్సవాలు మూడు రోజుల పాటు జరుగుతున్నాయి. రెండో రోజు కార్యక్రమానికి మంత్రి పొంగులేటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక పూజలు చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాములవారి కోసం రామదాసు అనేక కష్టాలు పడి భద్రాచలం లో రామాలయం నిర్మించారని, ప్రతీ సంవత్సరం రామదాసు జన్మస్థలం నేలకొండపల్లి లో జయంతి ఉత్సవాలను ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తున్నప్పటికీ  స్థానిక విద్వత్ కళా పీఠం సహకారంతో జరుపుతున్నారని, వారి కృషి అభినందనీయమన్నారు.

త్వరలో రూ.2.65 లక్షలు రాబోతున్నాయని,  వాటితో రామదాసు మందిరాన్ని అభివృద్ధి చేయిస్తామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో టీజీ ఐడీసీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, విద్వత్ కళాపీఠం సభ్యులు సాదులు రాధాకృష్ణ మూర్తి, పెండ్యాల గోపాలకృష్ణ, నంచర్ల దేవి ప్రసాద్, మల్లికార్జునరావు, మన్నె కోటేశ్వరరావు, నాయకులు నెల్లూరి భద్రయ్య, శాఖమూరి రమేశ్ పాల్గొన్నారు.  

తుమ్మూరు భారతి,  మట్టూరికి నివాళి 

సత్తుపల్లి/కల్లూరు ,వెలుగు : సత్తుపల్లి మండల పరిధిలోని సదాశివునిపాలెం గ్రామంలో ఇటీవల మృతి చెందిన తుమ్మూరు భారతి ఫొటోకు మంత్రి నివాళులర్పించారు. కల్లూరులో సీపీఎం సీనియర్ నాయకుడు, లింగాల మాజీ సర్పంచ్ మట్టూరి భద్రయ్య(90) అనారోగ్యంతో శనివారం రాత్రి మృతి చెందారు. ఆదివారం భద్రయ్య అంత్యక్రియలకు మంత్రి హాజరై నివాళులర్పించారు.  కుటుంబ సభ్యులను ఓదార్చారు. 

మంత్రికి జర్నలిస్టుల వినతి

ఖమ్మం : జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ పలు జర్నలిస్టు సంఘాల నేతలు ఆదివారం ఖమ్మంలోని మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో ఆయనను కలిసి వినతి పత్రం అందజేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకుంటామన్నారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు, లీగల్ ఇష్యూస్ రాకుండా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలనేదే తమ అభిమతమని తెలిపారు.