చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తాం : మంత్రి పొంగులేటి

 చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తాం : మంత్రి  పొంగులేటి
  • మంత్రి  పొంగులేటి శ్రీనివాసరెడ్డి
  • కూసుమంచి, ఖమ్మం రూరల్​మండలాల్లో పర్యటన 
  • వడ్ల కొనుగోలు కేంద్రం, పలు అభివృద్ధి పనుల ప్రారంభం 

ఖమ్మం రూరల్, వెలుగు : రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం మంత్రి కూసుమంచి, ఖమ్మం రూరల్​ మండలాల్లో పర్యటించారు. కూసుమంచి మండలం నాయకన్ గూడెంలోని గంగమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకొని అక్కడే ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. 

అనంతరం రూరల్​మండలం మద్దులపల్లి నుంచి తల్లంపాడ, తెల్దారుపల్లి జడ్పీ రోడ్డు వరకు సీఆర్ఆర్ నిధులు రూ. కోటి 80 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, వరంగల్ క్రాస్ రోడ్డులో తరుణి హాట్​లో2 కోట్లతో ఏర్పాటు చేయనున్న 33/11కేవీ విద్యుత్ ఉప కేంద్రం పనులు, గూడూరుపాడు నుంచి గోళ్లపాడు, ఊటవాగు తండా రోడ్డు వరకు రూ.2.97కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ప్రజా ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత కల్పించామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 25.65లక్షల రైతులకు రూ.20,687 కోట్లు రుణమాఫీ పూర్తి చేశామన్నారు. దేశ చరిత్రలో మద్దతు ధరతో పాటు క్వింటాల్ కు రూ.500 బోనస్ చెల్లిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలిపారు. వానాకాలం పంటకు రూ.1,700 కోట్లు బోనస్ అందించామన్నారు. .

అన్ని రంగాలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన ప్రాంతాల్లో సబ్ స్టేషన్లను అభివృద్ధి చేస్తోందని, ఇందులో భాగంగా ఖమ్మం రూరల్ ప్రాంతంలో పవర్ ఇబ్బందులు తొలగించేందుకు సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టామని తెలిపారు.  అడిషనల్​కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వానాకాలం సీజన్ లో నాయకన్ గూడెంలోని 250 రైతుల నుంచి 12 వేలకు క్వింటాళ్లకు పైగా ధాన్యాన్ని మద్దతు ధరపై కోనుగోలు చేసినట్లు గుర్తుచేశారు. 

ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, విద్యుత్ శాఖ చీఫ్ ఇంజినీర్ రాజు చౌహాన్, ఆర్డీఓ నరసింహారావు, ఆపరేషన్ సర్కిల్ ఎస్ఈఈ శ్రీనివాసచారి, డీఆర్డీవో సన్యాసయ్య, జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్ కుమార్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ జి. శ్రీలత, ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు, అడిషనల్ డీఆర్డీవో నూరొద్దీన్, తహసీల్దార్లు కరుణశ్రీ, రామ్ ప్రసాద్, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బి.హరినాథ్ బాబు, డీఈ సీహెచ్ నాగేశ్వర్ రావు, డీఈ  హీరాలాల్, మండల వ్యవసాయ అధికారి,  ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.