విద్య, వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి : పొంగూలేటి శ్రీనివాసరెడ్డి

విద్య, వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి : పొంగూలేటి శ్రీనివాసరెడ్డి
  • మంత్రి పొంగూలేటి శ్రీనివాసరెడ్డి

ఇల్లెందు, వెలుగు :  విద్య, వైదంపై కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఇల్లెందు పట్టణ, మండలంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని  రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. 

దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా ప్రతీ నియోజకవర్గానికి రూ. 200 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను కాంగ్రెస్​ ప్రభుత్వం నిర్మించనున్నట్లు తెలిపారు. ఇల్లెందు మండలంలోని పూబెల్లిలో మంజూరైన 83 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టినా రాబోయే కాలంలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టేలా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. 

సుమారుగా రూ. 37.52 కోట్లతో నిర్మించనున్న వంద పడకల ప్రభుత్వ వైద్యశాల నిర్మాణ పనులకు, రూ. 1.50 కోట్లతో మండలంలో ఆర్ అండ్​బీ రోడ్డు నుంచి బోయితండా వరకు, రూ. 3 కోట్లతో రొంపేడు చెక్ పోస్ట్ నుంచి మిట్టపల్లి వరకు, రూ. 4.46 కోట్లతో ఆర్ ​అండ్ బీ రోడ్డు నుంచి మామిడి గుండాల వరకు బీటు రోడ్లు, రిపేర్ల పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, కలెక్టర్ జితేశ్​వి. పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, డీసీహెచ్ఎస్ రవిబాబు, అడిషనల్​ కలెక్టర్ విద్యాచందన, కొత్తగూడెం ఆర్డీఓ మధు, ఇల్లెందు డీఎస్పీ ఎన్. చంద్రభాను, ఇల్లెందు, టేకులపల్లి సీఐలు బత్తుల సత్యనారాయణ, తాటిపాముల సురేశ్​ తదితరులు పాల్గొన్నారు.