- రైతులకు ఇబ్బంది లేకుండా పత్తి కొనుగోళ్లు
కూసుమంచి, వెలుగు : పార్టీలకతీతంగా అర్హులైన పేదలందరికి దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇండ్లను అందజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.మంగళవారం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గోల్ తండాలోని శ్రీ భాగ్యలక్ష్మి కాటన్ ఇండస్ట్రీస్ లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని వచ్చే నెల 1, 2 తేదీల్లో ప్రారంభిస్తామని, మొదటి విడతగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తామని చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పత్తి కొనుగోళ్లు చేస్తామని తెలిపారు.
భారీ వర్షాల కారణంగా పత్తి రైతులకు నష్టం వాటిల్లిందని, ఖమ్మం జిల్లాలో 9 జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు ఏర్పాటుచేసి, రైతులకు మద్దతు ధర అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 25 రోజుల్లోనే రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేశామని, ఇంకా రూ.13 వేల కోట్ల రుణమాఫీ డిసెంబర్‌లోగా పూర్తి చేస్తామని తెలిపారు. అంతకుముందు మంత్రి తిరుమలాయపాలెం మండలం బీరోలు పెద్ద చెరువుకు రూ.3 కోట్లతో చేపట్టనున్న చెరువు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వర్క్ ఆర్డర్ ప్రకారం పనులను నాణ్యతగా గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాస్‌రెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, మిషన్ భగీరథ ఈఈ పుష్పలత, డీఏవో పుల్లయ్య, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ బాబు పాల్గొన్నారు.