
హైదరాబాద్, వెలుగు: గుజరాత్లోని సబర్మతి నదిని డెవలప్ చేసినట్టుగా మూసీని అభివృద్ధి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. త్వరలోనే పార్టీలకతీతంగా జీహెచ్ఎంసీ మేయర్ తోపాటు 150 మంది కార్పొరేటర్లను స్టడీ టూర్ కు తీసుకెళ్తామని ఆయన చెప్పారు. మూసీ ఫేజ్–1 కింద బాపు ఘాట్ వద్ద అభివృద్ధి పనులను ఏ విధంగా చేపట్టాలని జీహెచ్ఎంసీ టీమ్ పరిశీలిస్తుందని పేర్కొన్నారు.
గుజరాత్ లోని సబర్మతి నదిని గురువారం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలతో కలిసి పరిశీలించిన ఆయన అక్కడ చేసిన అభివృద్ధి పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గుజరాత్ లోని అమూల్ డెయిరీ ప్రధాన కార్యాలయాన్ని సైతం మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ , సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలు పరిశీలించారు. శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్, అమూల్ డెయిరీ వ్యవస్థాపకుడు త్రిభువన్ వందాస్ కె పటేల్ విగ్రహాలకు నివాళులు అర్పించారు.