అధికారులు తప్పు చేసి జైలుపాలు కావొద్దు : మంత్రి సీతక్క

అధికారులు తప్పు చేసి జైలుపాలు కావొద్దు : మంత్రి సీతక్క
  • నిబంధనల మేరకు స్వేచ్ఛగా పనిచేయండి: మంత్రి సీతక్క 
  • వాస్తవాలు దాచి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: అధికారులు ఎవరి ఒత్తిళ్లకూ లొంగకుండా.. నిబంధనల మేరకు స్వేచ్ఛగా పనిచేయాలని.. తప్పులు చేసి జైలుపాలు కావొద్దని మంత్రి సీతక్క సూచించారు. మంత్రుల మెప్పుకోసం వాస్తవాలు దాచిపెట్టి.. తప్పుడు రిపోర్టులు ఇవ్వొద్దన్నారు. ‘‘మీరు పొరపాట్లు చేసి.. మమ్మల్ని ఇబ్బందులపాలు చేయొద్దు’’ అని హితబోధ చేశారు. గురువారం ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ కార్యాలయంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. 

శాఖల పనితీరు, పురోగతి తదితర అంశాలపై చర్చించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నిబద్ధతతో పనిచేసి శాఖ గౌరవాన్ని నిలబెట్టాలని సూచించారు. వాస్తవాలనే నివేదించాలని సూచించారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పెండింగ్ బిల్లుల చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైందన్నారు. నరేగాకు సంబంధించిన రూ.300 కోట్ల బిల్లులను విడుదల చేశామని పేర్కొన్నారు. మల్టీ పర్పస్ వర్కర్ల వేతన బకాయిలను విడుదల చేసినట్టు చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ తరహాలోనే ప్రతి విభాగంలో ఉద్యోగుల సమస్యలను ఆన్​లైన్ లో పరిష్కరించాలని సూచించారు.

 క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులు హైదరాబాద్​కు రాకుండా, అధికారులు వారి సమస్యలు అక్కడిక్కడే పరిష్కరించాలన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో మిషన్ భగీరథ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్టు మంత్రి పేర్కొన్నారు. వేసవి సన్నద్ధతలో భాగంగా గ్రామస్థాయిలో తాగునీటి సరఫరాకు సంబంధించి పైపులైన్లు, కనెక్షను చెక్ చేయాలన్నారు. మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ సిబ్బంది లీకేజీలు, తాగునీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి లోకేశ్ కుమార్, డైరెక్టర్ సృజన తదితరులు పాల్గొన్నారు. 

గురుకులాల్లో పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తున్నాం.. 

గురుకులాల్లో పదేండ్లుగా పెండింగ్ లో ఉన్న  సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. గురువారం  ఎర్రమంజిల్ లోని మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. కలుషిత ఆహార ఘటనలపై ప్రభుత్వ సీరియస్ గా ఉందని, ఈ ఘటనలపై ప్రభుత్వం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తుందని పేర్కొన్నారు. కొందరు వ్యక్తిగత స్వార్థంతో గురుకులాలపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హాస్టళ్లలో అందించే ఫుడ్ సొంత కుటుంబాన్ని గుర్తుచేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు మొదటి ప్రాధాన్యమిస్తుందన్నారు.