కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో వారి ఇంట్లో ఐదు ఉద్యోగాలు ఊడినయ్: సీతక్క

ఆదిలాబాద్ జిల్లా అక్షర క్రమంలో ముందుండి అభివృద్ధిలో మాత్రం వెనుకబడిందన్నారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క.  సరస్వతి దేవి కొలువైన ప్రాంతం.. ఎందరో మహనీయులు పుట్టిన ప్రాంతం ఆదిలాబాద్ అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆదిలాబాద్ జిల్లాపై ఎంతో ప్రేమ ఉందని చెప్పారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని రాజరాజేశ్వర గార్డెన్స్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ ఎన్నికలపై మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. సీఎం అయిన తర్వాత పర్యటనను సైతం ఇక్కడినుండే మొదలుపెడతారని..  హైదరాబాద్ లో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ జిల్లాపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని తెలిపారు. ఓడిన అభ్యర్థులు సైతం ప్రజల్లో ఉండి వారి కష్ట సుఖాలు తీర్చేందుకు ముందుండాలని ఆమె సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తే... ఆటో సంఘాలతో ఆందోళన చేయించిన ఘనత బీఆర్ఎస్ పార్టీదని మండిపడ్డారు. 

తాము అధికారంలోకి వచ్చిన రెండు రోజుల నుండే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ దూషించడం మొదలుపెట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇంట్లోని 5 ఉద్యోగాలు పోవడంతో వారి ఆటలు సాగడం లేదని.. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లే కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ కుటుంబం.. త్యాగాల కుటుంబం, పదవుల కుటుంబం కాదని చెప్పారు.  సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే.. కెసిఆర్ కుటుంబం పదవులను అనుభవించిందని ఫైర్ అయ్యారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.