మహిళా సంఘాల సక్సెస్ స్టోరీలకు పుస్తక రూపం ఇవ్వాలి : సీతక్క

మహిళా సంఘాల సక్సెస్ స్టోరీలకు  పుస్తక రూపం ఇవ్వాలి : సీతక్క
  • భారత్ సమ్మిట్ ప్రతినిధులతో ఇందిరా మహిళా శక్తి బజార్​ను సందర్శించిన సీతక్క

హైదరాబాద్, వెలుగు: మహిళా సంఘాల సక్సెస్ స్టోరీలకు పుస్తక రూపం ఇవ్వాలని, ఆ పుస్తకాలు ఎందరికో ప్రేరణగా నిలుస్తాయని మంత్రి సీతక్క అన్నారు. శనివారం హైదరాబాద్​శిల్పారామంలోని ఇందిరా మహిళా శక్తి బజార్ ను భారత్ సమ్మిట్ ప్రతినిధులు మంత్రి సీతక్కతో కలిసి సందర్శించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు నిర్వహిస్తున్న వ్యాపారాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మహిళా శక్తి క్యాంటీన్ విజయ గాథ లఘు చిత్రంతోపాటు  పేరణి, శివతాండవం ఇతర తెలంగాణ నృత్య రూపాలను ప్రదర్శించారు. 

స్వయం సహాయక మహిళలు విదేశీ ప్రతినిధులతో తమ వ్యాపార అనుభవాలను పంచుకున్నారు. ఇందిరా మహిళా శక్తి పాలసీ ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించామని, ప్రజా ప్రభుత్వం గొప్ప ఆలోచనతో ప్రమాద బీమా ఇవ్వడంతో మహిళా సంఘాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని మహిళలు సమ్మిట్ ప్రతినిధులకు వివరించారు. స్వయం సహాయక సంఘానికి చెందిన రాధ అనే మహిళ తన సక్సెస్ స్టోరీని వివరించారు. అది విన్న సీతక్క ఆమె ఎందరికో స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. 

‘‘రాధ ఐకేపీ సెంటర్ ను విజయవంతంగా నడుపుతున్నారు. ఆమె ఇప్పుడు చదువుకోవాలనుకోవడం అభినందనీయం. రాధ జీవిత స్టోరీని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ఆమెలో నన్ను నేను చూసు కుంటున్నాను. నేనూ పదోతరగతితో చదువు ఆపేశాను. అజ్ఞాతం వీడి జనజీవనం లోకి వచ్చాక చదువు కొనసాగించాను. ఎల్ఎల్ బీ, ఎల్ఎల్ ఎం, పీహెచ్​ డీ చేశాను. రాధ ఎన్నో కష్టాలను ఎదిరించి ఈ స్థాయికి వచ్చారు. ఆమె కష్టానికి కుంగిపోతే ఈ స్థాయికి వచ్చేది కాదు” అని సీతక్క పేర్కొన్నారు.