లైంగిక దాడులను ఉపేక్షించేది లేదు : మంత్రి సీతక్క

లైంగిక దాడులను ఉపేక్షించేది లేదు : మంత్రి సీతక్క
  • నిందితులను కఠినంగా శిక్షిస్తం: మంత్రి సీతక్క
  • ఘటనలపై డీజీ, సీపీ, మహిళా శిశు సంక్షేమ అధికారులతో ఆరా
  • బాధితులను ఆదుకోవాలని ఆదేశాలు జారీ 

హైదరాబాద్, వెలుగు: అత్యాచారాలు, లైంగిక దాడులను ఉపేక్షించేది లేదని, నాగర్ కర్నూల్ జిల్లా, హైదరాబాద్ లో జరిగిన లైంగిక దాడి ఘటనల్లో నిందితులను కఠినంగా శిక్షిస్తామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. మంగళవారం సంబంధిత పోలీసు అధికారులు, మహిళా సంక్షేమ అధికారులతో మాట్లాడి ఘటనలపై ఆరా తీశారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ శిఖా గోయల్, హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు సీవీ ఆనంద్, సుధీర్ కుమార్, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీతో  ఫోన్ లో మాట్లాడారు. 

కేసు పురోగతి వివరాలు, బాధితుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉండడంతోపాటు నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. నిందితులందరినీ గంటల వ్యవధిలోనే అరెస్టు చేశామని ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆధీనంలోని సఖీ సెంటర్లలో బాధితులను సంరక్షిస్తున్నామని, వారి బాగోగులు అన్నింటినీ ప్రభుత్వమే చూసుకుంటుందన్నారు.

బాధితురాలితో మాట్లాడిన మహిళా కమిషన్ 

రాష్ట్రం లో మహిళల పై జరుగుతున్న లైంగిక దాడులను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా ఖండించింది. నాగర్ కర్నూల్ అత్యాచార బాధితురాలితో మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరేళ్ల శారద ఫోన్​లో మాట్లాడి ధైర్యం చెప్పారు. మహిళా కమిషన్ బాధితురాలికి అండగా ఉంటుందని, ప్రభుత్వం నుంచి సత్వర సహకారం అందేలా చర్యలు తీసుకుంటామని చైర్ పర్సన్ హామీ ఇచ్చారు. జర్మన్​యువతిపై ఘటనకు సంబంధించి పోలీసు అధికారులతో ఆమె మాట్లాడారు. నిందితులపై  కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.