స్విట్జర్లాండ్లో టీఈపీఏ డెస్క్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్​బాబు

స్విట్జర్లాండ్లో టీఈపీఏ డెస్క్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్​బాబు
  • యూరోపియన్​ ఫ్రీ ట్రేడ్​ అసోసియేషన్​ దేశాల పెట్టుబడులే లక్ష్యంగా ఏర్పాటు

హైదరాబాద్, వెలుగు: యూరప్​ దేశాల నుంచి పెట్టుబడులను తీసుకొచ్చేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​ బాబు చెప్పారు.  శనివారం ఆయన స్విట్జర్లాండ్​లోని జ్యూరిచ్​లో ‘ఇన్వెస్ట్​ తెలంగాణ’ ఇనిషియేటివ్​లో భాగంగా ‘ట్రేడ్​ అండ్​ ఎకనమిక్​ పార్ట్​నర్​షిప్​ అగ్రిమెంట్​ (టీఈపీఏ)’ డెస్క్​ను ప్రారంభించారు. దాంతోపాటు జ్యూరిచ్​​ ఇన్నోవేషన్​ పార్క్​లో 40కిపైగా స్విస్​ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. 

యూరోపియన్​ ఫ్రీ ట్రేడ్​ అసోసియేషన్​ (ఈఎఫ్​టీఏ) దేశాలు, ఇండియా మధ్య నిరుడు మార్చిలో ట్రేడ్​ అగ్రిమెంట్​ జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ ఒప్పందంతో వచ్చే 15 ఏండ్లలో 10 వేల కోట్ల డాలర్ల పెట్టుబడులతోపాటు దేశంలో 10 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని వెల్లడించారు. అందులో ఎక్కువ శాతం పెట్టుబడులు, ఉద్యోగాలు తెలంగాణకు తీసుకొచ్చేలా ఆయా దేశాలు, సంబంధిత కేంద్ర విభాగాలతో సమన్వయం చేసుకుంటూ పనిచేసేలా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. 

ఇన్వెస్టర్లకు సహకరించేలా సింగిల్​ విండో మెకానిజంతో పనిచేసేలా టీఈపీఏ డెస్క్​ను ప్రారంభించామన్నారు. పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ అన్ని రకాలుగా అనుకూలమైన రాష్ట్రమని స్విస్​ కంపెనీల ప్రతినిధులకు వివరించారు. ఇండియాలో పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానమని తెలిపారు. ఇప్పటికే స్విట్జర్లాండ్​కు చెందిన పలు ప్రముఖ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయని గుర్తు చేశారు. సీఎం రేవంత్​ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ బ్రాండ్​ను ప్రపంచవ్యాప్తం చేసేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. సంస్థలకు అన్ని రకాలుగా సహకారం అందిస్తామని, కొత్త టెక్నాలజీలపై పెట్టుబడులు పెట్టే సంస్థలను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు.