తెలంగాణలో వక్క సాగును ప్రోత్సహిస్తాం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

తెలంగాణలో వక్క సాగును ప్రోత్సహిస్తాం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  • ఏపీలో వక్క సాగును పరిశీలించిన మంత్రి తుమ్మల 

ఖమ్మం, వెలుగు: రైతులకు వక్క పంట సాగు సిరులు కురిపిస్తోందని, తెలంగాణలో సైతం వక్క పంటల సాగును ప్రోత్సహిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఏపీలోని ఏలూరు జిల్లా కామవరపు కోటలో వాణిజ్య పంటలైన వక్క తోటల సాగును ఆయన పరిశీలించారు. సాగు పద్ధతులు, ఆదాయ వ్యయాలపై రైతులతో చర్చించారు. తెలంగాణలో వక్కసాగు విస్తరణ, అవకాశాలపై నిపుణులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏపీలో వక్క సాగుతో రైతులు లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారన్నారు. 

అనేక మంది రైతులు కొబ్బరి, పామాయిల్ తోటలలో అంతర పంటగా సాగు చేస్తూ అధిక లాభాలు అర్జిస్తున్నారని వివరించారు. అన్నదాతలు ఆధునిక సాగు వైపు అడుగులు వేయాలని, అధిక ఆదాయం పొందేందుకు ఈ పంటలు ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. వక్క సాగు చేస్తున్న అనేకమంది రైతులు నుంచి అనూహ్య స్పందన లభించిందని, సాగు చాలా ఆశాజనకంగా ఉందని రైతుల పేర్కొన్నట్లు మంత్రి వివరించారు. తెలంగాణ రైతాంగాన్ని రాజును చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని, రైతన్నలు శ్రేయస్సుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 

ప్రసన్నాంజనేయ స్వామి పవర్​ ఫుల్​

సత్తుపల్లి : వందల సంవత్సరాల చరిత్ర గల పట్టణ శివారులోని హనుమాన్ నగర్ శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి చాలా పవర్ ఫుల్ అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆలయ పున ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దంపతులు పాల్గొని ఆలయ నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూసంపుడి మహేశ్, తుమ్మల తనయుడు, కాంగ్రెస్ యువ నాయకుడు డాక్టర్ తుమ్మల యుగంధర్, ఆలయ కమిటీ నిర్వాహకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.