
- లిఫ్ట్ పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల
ఖమ్మం టౌన్, వెలుగు : రైతులకు సాగునీరు అందించే మంచుకొండ ఎత్తిపోతల పథకం పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం లిఫ్ట్ పనులను ఆయన పరిశీలించారు. ప్రాజెక్టు పనుల పురోగతి, ల్యాబ్, ప్రెజర్ మెయిన్స్, కంట్రోల్ ప్యానెల్స్, మోటార్ల ఏర్పాటు లాంటి వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈఈ, డీఈలు పనుల పురోగతిని మంత్రికి వివరించారు.
పథకానికి సంబంధించి మిగిలి ఉన్న ప్రెజర్ మెయిన్స్ పనులు మార్చి 25 లోపు పూర్తి చేస్తామని, మార్చి 17 నాటికి మొదటి స్లాబ్ నిర్మాణం అయిపోతుందని, ఆ తదుపరి నాగార్జున సాగర్ కాలువ నుంచి నీటిని తీసుకునేందుకు వీలుగా పనులు చేపడతామని అన్నారు. రైతులను సమన్వయం చేసుకుంటూ పనులు స్పీడప్ చేయాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ ఈఈ అనన్య, డీఈఈ ఝాన్సీ, ఏఈఈ శ్రీరామ్, రాజీవ్ గాంధీ, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యారగర్ల హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.